టీ-కాంగ్రెస్‌ లో ఐక్య‌త‌.. రేవంత్ కోస‌మేనా..?

Update: 2019-09-23 08:12 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు తెర‌మీదికి వ‌స్తాయో చెప్పడం క‌ష్టం. ఎప్పుడు ఏ నేత ఎలా వ్య‌వ‌హరిస్తారో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే అవుతుంది. అవ‌స‌రం - అవ‌కాశం ఈ రెండు నాయ‌కుల‌ను ఎంతో ముందుకు న‌డిపిస్తుంటాయి. ఇప్ప‌డు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌త ప్రజాస్వామ్యం ఎక్కువ‌గా ఉండే కాంగ్రెస్‌లో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే అల‌వాటు ఎక్కువ‌గానే ఉంది. టీ కాంగ్రెస్‌ లో ఎవ‌రికి వారే తామే లీడ‌ర్లం అని ప్ర‌క‌టించేసుకుంటూ ఉంటారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన నేత‌లు అయితే ఎవ‌రికి వారే తమ‌కు తామే సీఎంలుగా ఫీల‌వుతుంటారు.

అయితే, ఇప్పుడు మాత్రం అంతా క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. త్వ‌రలోనే హుజూర్ న‌గ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించి అభ్య‌ర్థి ఎంపిక విష‌యం నుంచి ఇప్ప‌టి వ‌రకు జ‌రుగుతున్న ప‌రిణామాలు రాజ‌కీయంగా సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. ఇక్క‌డ నుంచి పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిని దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆమె గ‌తంలో కోదాడ ఎమ్మెల్యేగా గెలిచి... గ‌త డిసెంబ‌ర్ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

ఇక ఇప్పుడు ఉత్త‌మ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో త‌న భార్యనే పోటీ చేయించాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే, ఈ విష‌యంలో నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చి.. చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు టీ-కాంగ్రెస్‌లో చ‌ర్చ‌కు దారితీస్తున్నారు. ఈయ‌న పార్టీలోకి అడుగు పెట్టిన వేళా విశేషం.. అన్ని విష‌యాల్లోనూ అధిష్టానం వ‌ద్ద మంచి మార్కులు సంపాయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడినా మ‌ల్కాజ్‌ గిరి ఎంపీగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న పీసీసీ పీఠంపై కూర్చునే అవ‌కాశం కూడా ఉంద‌ని, ఆ దిశ‌గా అధిష్టానం దృష్టి పెట్టింద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

అయితే, ఈ విష‌యంలో అలా పొక్కిందో లేదో.. అప్పుడే టీ కాంగ్రెస్ నాయ‌కులు అలెర్ట్ అయిపోయారు. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న విధంగా ఉన్న వీరంతా.. ఒకే తాటిపైకి వ‌చ్చి.. తామంతా ఒక‌టేన‌ని - త‌మ‌కెవ‌రూ సాటిరార‌ని అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఐక్యంగా ముందుకు సాగి హుజూర్‌ న‌గ‌ర్ సీటును త‌మ ఖాతాలో వేసుకోవ‌డం ఖాయ‌మ‌ని ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ల‌కొర‌కంగా ప‌నివిభ‌జ‌న చేసుకుని ముందుకు సాగుతున్నారు.

ఎప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఉత్త‌మ్‌ - కోమ‌టిరెడ్డి - జానారెడ్డి సైతం ఈ విష‌యంలో ఒకే తాటిమీద‌కు వ‌చ్చేశారు. త‌మ జిల్లా రాజ‌కీయాల్లో ఇత‌ర జిల్లాల నాయ‌కుల జోక్యం అక్క‌ర్లేద‌ని కూడా చెప్పేశారు. తాము ప‌ద్మావ‌తిని గెలిపించుకుంటామ‌ని కూడా చెపుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో క‌నిపించే మోర‌ల్‌.. ర‌ల్‌.. ఎల్‌.. ఏంటంటే.. ముందొచ్చిన చెవుల క‌న్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి .. అన్న‌ట్టుగా ఎదుగుతున్న రేవంత్‌ కు చెక్ పెట్ట‌డ‌మేన‌ని తెలుస్తోంది. మ‌రి టీ కాంగ్రెస్ అనుస‌రిస్తున్న విధానం.. రాష్ట్రంలో పార్టీని ఏ తీరానికి తీసుకు వెళుతుందో ?  చూడాలి.
Tags:    

Similar News