అసెంబ్లీ సీట్ల‌పై క‌న్నేసిన మాజీ ఎంపీలు!

Update: 2018-09-14 04:59 GMT
తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు.. గ‌తంలో ఎంపీలుగా ప‌ని చేసిన వారు.. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓట‌మిపాలైన వారంతా ఇప్పుడు అసెంబ్లీ రేసులోకి దిగేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌టంతో పాటు.. సేఫ్ గేమ్ ఆడేందుకు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు సిద్ధ‌మ‌య్యారు. గ‌త సార్వ‌త్రికంలో ఎంపీలుగా బ‌రిలోకి దిగిన వారంతా అసెంబ్లీ వైపు అడుగులు వేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరి ఎంట్రీతో.. తెలంగాణ అసెంబ్లీ టికెట్ల‌కు భారీగా గిరాకీ పెరిగిన‌ట్లైంది.

అసెంబ్లీ రేసులోకి రావ‌టానికి కార‌ణం రెండు కీల‌క అంశాలుగా చెబుతున్నారు. కేసీఆర్ మీద తెలంగాణ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఓట్ల రూపంలో మారి టీఆర్ ఎస్ చిత్తుగా ఓడిపోతే.. ముఖ్య‌మంత్రి రేసులోకి రావొచ్చ‌న్న ఆలోచ‌న‌తో పాటు.. అసెంబ్లీలో ప్ర‌తికూల ఫ‌లితం ఎదురైనా.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న భావ‌న‌తో అసెంబ్లీ టికెట్ మీద క‌న్నేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇలా అసెంబ్లీ రేసులోకి వ‌చ్చిన మాజీ కాంగ్రెస్ ఎంపీల జాబితా కాస్త పెద్ద‌దిగానే ఉంది.  రాజ్య‌స‌భ స‌భ్యులుగా.. లోక్ స‌భ‌కు పోటీ చేసి ఓట‌మిపాలైన నేత‌లంతా త‌మ అదృష్టాన్ని ఒక‌సారి ప‌రీక్షించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇలా అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున‌న వారిలో గ‌త ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి.. త‌ర్వాతి కాలంలో వ‌రంగ‌ల్ లోక్ స‌భ‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన స‌ర్వే స‌త్యానారాయ‌ణ ఒక‌రు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా వాద‌న వినిపిస్తోన్న క్ర‌మంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని స‌ర్వే భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదే రీతిలో అసెంబ్లీ బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న నేత‌ల జాబితాలో న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ లో ఒక‌రైన రాజ‌గోపాల్ రెడ్డి.. మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌.. కొన‌గాల మ‌హేశ్‌..స‌బిత కుమారుడు ప‌ట్లోళ్ల కార్తీక్ రెడ్డి.. మాజీ కేంద్ర‌మంత్రి రేణుకా చౌద‌రి.. మాజీ ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్ లు కూడా అసెంబ్లీ గోదాలోకి దిగేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రి.. వీరి ఆలోచ‌న‌ల‌కు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News