టీ మంత్రులు వచ్చేశారు.. రేవంత్ చెప్పినట్లే చీరలు.. గాజులు పంపుతారా?

Update: 2021-12-25 08:35 GMT
కేంద్రమంత్రి నోటి నుంచి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ రాజకీయ జోస్యం చెప్పిన వేళ.. రాష్ట్రంలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. కేంద్రం వానా కాలంలో వడ్లు ఎంత కొంటుందో తేల్చటంతో పాటు.. యాసంగి ధాన్యాన్ని కొంటామన్న స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు వెనక్కు రావొద్దని.. అవసరమైతే అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డి సూచన చేశారు.

తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టేందుకే టీఆర్ఎస్ నేతలు వీధి నాటకాలు ఆడుతున్నారని.. వారిలో కమిట్ మెంట్ లేదన్నారు. మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నా.. గులాబీ నేతలకు పట్టలేదన్నారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీని కలవకుండా తిరిగి వచ్చారని.. మంత్రి కేటీఆర్ కు కేంద్రమంత్రి గోయల్ గడ్డి పెట్టి పంపారన్నారు.

వరంగల్ గోదాముల్లో 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్ మాల్ పై నిలదీయటంతో దొంగల్లా పారిపోయి వచ్చారన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఫోటోలు దిగి అక్కడ ఆందోళన చేసినట్లుగా ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నారు. ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు దేశ రాజధానిలో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి టీ మంత్రులు ఉత్త చేత్తో తిరిగి వస్తే.. చీరలు.. గాజులు పంపుతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతున్న తెలంగాణ అధికారపక్షం.. బీజేపీపై చావు డప్పు మోగిస్తూ నిరసన వ్యక్తం చేయటం తెలిసిందే.

అయితే.. ఈ చావుడప్పు నిరసనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రి కేటీఆర్ కానీ ఎమ్మెల్సీ కవిత కానీ.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కానీ ఎందుకు పాల్గొనటం లేదని ప్రశ్నించారు. ఎంపీల టీంలో కేటీఆర్.. సంతోష్ లు ఎందుకు లేరన్న ఆయన.. గడిచిన ఆరు రోజులుగా వారు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా టీ మంత్రుల తీరుపైనా.. కేసీఆర్ కుటుంబ సభ్యులపైనా ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్.. ఉత్త చేత్తో తిరిగి వచ్చిన వారికి తాను చెప్పినట్లే చీరలు.. గాజులు పంపుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఒకవేళ అదే చేస్తే.. రాజకీయ వాతావరణం మరింత గరంగరంగా మారుతుందనటంలో సందేహం లేదు.


Tags:    

Similar News