ధరణిపై హైకోర్టులో టీ సర్కారు కీలక వ్యాఖ్యలు.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే

Update: 2020-10-22 07:15 GMT
దేశంలో మరెక్కడా లేని రీతిలో ధరణి అనే పోర్టల్ ను తీసుకొచ్చి.. తెలంగాణ రాష్ట్రంలోని ఆస్తుల నమోదుపై తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం తెలిసిందే. పరిమిత కాలాన్ని లక్ష్యంగా పెట్టుకొని.. రాష్ట్ర ప్రజలు తమ ఆస్తుల వివరాల్ని ధరణి వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని చెప్పటం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వారి వివరాల్ని సేకరిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఒక పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలైంది. ధరణి వెబ్ సైట్ లో పదిహేను రోజుల్లో పేరు నమోదుచేసుకోవాలని.. లేనిపక్షంలో ఇబ్బందులకు గురవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. గడువు లోపు ధరణిలో పేరు నమోదు చేసుకోకపోతే ఏమవుతుందన్న సందేహం ఉండనే ఉంది.

ఇదే అంశాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రశ్నించింది. దీనిపై బదులిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ధరణిపై ప్రత్యేకంగా ఫలానా డేట్ లోపలే ఆస్తుల వివరాల్ని నమోదు చేసుకోవాలన్న నిబంధన లేదని తేల్చారు. అంతేకాదు.. ధరణి సైట్లో ఆస్తుల నమోదు ప్రక్రియ అన్నది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. ధరణి పోర్టల్ కు ఎలాంటి చట్టబద్ధత లేదంటూ పిటీషనర్ వాదన నేపథ్యం లో ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదనల్ని వినిపించారు.

ప్రజల ఆస్తులు.. వ్యక్తిగత వివరాలు 15 రోజుల్లోఆధార్ వెబ్ పోర్టల్ లో పెట్టి  ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై వ్యక్తిగత వివరాల రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే.. వెబ్ పోర్టల్ లో ఆస్తుల నమోదుకు 15 రోజులే గడువు విధించినట్లు గా పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యం లో.. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని చెప్పాలని కోర్టు కోరింది.

అనంతరం కోర్టు సూచన మేరకు తెలంగాణ సర్కారుతో మాట్లాడిన న్యాయవాది.. ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమం నిరంతరం సాగే ప్రక్రియగా పేర్కొన్నారు. వెబ్ పోర్టల్ లో ప్రజల వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత లభిస్తుందని చెప్పారు. తాజాగా ఇచ్చిన క్లారిటీ పలువురికి ఉపశమనంగా మారనుంది. ఊళ్లల్లో లేని వారు.. విదేశాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ప్రయోజనకరం గా ఉంటుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News