కొత్త బాదుడుకి కేసీఆర్ స‌ర్కార్ రెఢీ!

Update: 2018-04-18 04:50 GMT
పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో ఇప్ప‌టికే మోడీ స‌ర్కార్ బాదుడు దేశ ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ఇది స‌రిపోన‌ట్లు తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ స‌రికొత్త బాదుడికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఇప్పుడు బాదే బాదుడుకు అద‌నంగా మ‌రో అర్థ‌రూపాయి ప్ర‌తి లీట‌ర్ మీదా బాదాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌.. డీజిల్ రేట్ల విష‌యానికి వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్య‌ధిక‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. కేంద్రం విధించే ప‌న్నుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌సూలు చేసే అద‌న‌పు ప‌న్నుల పుణ్య‌మా అని ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఓప‌క్క రోజువారీగా ఐదు పైస‌లు.. ప‌ది పైస‌లు చొప్పున అంత‌కంత‌కూ పెంచేస్తున్న ధ‌ర‌ల కార‌ణంగా ఇప్పుడు లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు భారీగా ఉన్నాయి.

ఈ భారం స‌రిపోద‌న్న‌ట్లు కేసీఆర్ స‌ర్కారు స‌రికొత్త బాదుడుకి ప్లానింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పేరుతో స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌తి లీట‌ర్ పెట్రోల్.. డీజిల్ అమ్మ‌కం మీదా అర్థ‌రూపాయి చొప్పున అద‌న‌పు భారాన్ని మోపేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో రెండు మెగా రింగ్ రోడ్లు.. హైవేలు.. రేడియ‌ల్ రింగ్ రోడ్ల‌తో స‌హా మొత్తం 5 వేల కిలోమీట‌ర్ల  మేర ర‌హ‌దారుల్ని అభివృద్ధి చేయాల‌ని కేసీఆర్ స‌ర్కార్ డిసైడ్ చేసింది.

ఇందుక‌య్యే ఖ‌ర్చు లెక్కలోకి వెళ్లిన స‌ర్కారు.. వాహ‌న‌దారుల నుంచి లీట‌రుకు అర్థ‌రూపాయి(50పైస‌లు) చొప్పున అద‌న‌పు సెస్సు వ‌సూలు చేస్తే..నిధుల కొర‌త ఉండ‌ద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసేందుకు ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ర‌హ‌దారుల అభివృద్ధి కార్య‌క్ర‌మం పేరుతో నిర్వ‌హించిన స‌మావేశంలో నిధుల స‌మీక‌ర‌ణ‌కు వివిధ మార్గాల‌పై చ‌ర్చ జ‌రిపి.. అంతిమంగా ఇంధ‌న అమ్మ‌కాల‌పై అద‌న‌పు సెస్సుకు మొగ్గు చూపిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే ప‌న్ను విధానాన్ని ఏపీ స‌ర్కారు ఇప్ప‌టికే అమ‌లు చేస్తోంది. తాజాగా తెలంగాణ స‌ర్కార్ కూడా ఈ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురావాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ అమ్మ‌కం ద్వారా కేంద్రం విధించే ప‌న్నులు మిన‌హాయిస్తే తెలంగాణ ప్ర‌భుత్వానికి రూ.18 వ‌ర‌కు ఆదాయం ల‌భిస్తోంది. తాజా రూ.అర్థ‌రూపాయి బాదుడుతో రూ.10వేల కోట్ల మేర ఆదాయాన్ని పొందే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పైకి అర్థ‌రూపాయిగా క‌నిపించినా.. మొత్తం భాదుడు ల‌క్ష్యం చూస్తే బావుర‌మ‌న‌క మాన‌దు. నొప్పి తెలీకుండా బాదే ఈ త‌ర‌హా బాదుడు నుంచి తెలుగు ప్ర‌జ‌ల‌కు విముక్తి ఎప్ప‌టికి?
Tags:    

Similar News