కేసు ఆమెది.. ఖర్చు టీ సర్కారుది

Update: 2015-08-21 04:23 GMT
ప్రభుత్వంలోని కీలక అధికారుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు పెద్ద మనసుతో వ్యవహరిస్తుందా? అన్న ప్రశ్న తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక అధికారిణికి.. ఒక మీడియా సంస్థకు మధ్య సాగుతున్న న్యాయపోరాటంలో ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక సాయం చేయటం కాస్తంత విశేషమే.

అవుట్ లుక్ పత్రికకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. స్మితను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒక కథనం ప్రచురించటం.. దీనిపై స్మిత సబర్వాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అన్నది న్యాయస్థానం తేలుస్తుందని అనుకున్నా.. కోర్టు ఖర్చుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారు సాయం చేస్తుండటం విశేషమే.

స్మిత సబర్వాల్ వేసిన పరువునష్టం దావాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. అవుట్ లుక్ పై ఆమె రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు. దీనికి అవసరమైన కోర్టు ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  అవుట్ లుక్ మ్యాగ్ జైన్ మీద న్యాయపోరాటం చేయటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. అందుకోసం రూ.15లక్షల భారీ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండటం విశేషమే.

అధికారుల వ్యక్తిగత వివాదాలు.. కేసులకు సంబంధించి న్యాయవిచారణకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయటమేమిటన్న వాదన వినిపిస్తోంది. రూ.10కోట్ల పరువునష్టం దావా కోసం హైకోర్టుకు రూ.9.75లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు కేసు వాదించేందుకు రూ.5లక్షల మేర ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అందుకే రూ.15లక్షల మొత్తాన్ని విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవేళ ఈ కేసులో కానీ విజయం సాధిస్తే.. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్ ఏ స్థాయి అధికారులకు ఇస్తారు? ఒకవేళ ఎవరు పరువునష్టం దావాలు వేసినా.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆర్థిక సాయం చేస్తుందా? లేక.. కొందరికి మాత్రమేనా అన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న ప్రశ్న సబబేనన్న మాట నిజమేనేమో..?
Tags:    

Similar News