ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ఎంత ఖ‌ర్చు అంటే?

Update: 2017-12-25 04:51 GMT
ఐదు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా.. 42 దేశాల‌కు చెందిన తెలుగు వారు.. ప‌లువురు రాష్ట్రేత‌ర తెలుగువారు హాజ‌రైన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కోసం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు చేసిన ఖ‌ర్చు లెక్క వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టిన కేసీఆర్ స‌ర్కారు.. సాటి తెలుగు ముఖ్య‌మంత్రిని పిల‌వ‌కుండా త‌ప్పు చేశార‌న్న మ‌చ్చ‌ను మీదేసుకున్నార‌ని చెప్పాలి.

విమ‌ర్శ‌ల వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెడితే.. చేసిన ఖ‌ర్చు ముచ్చ‌ట‌లోకి వెళితే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసిన అంచ‌నాపై ఆస‌క్తిక‌ర వ్య‌వ‌హారాన్ని కొంద‌రు చెప్పుకోవ‌టం క‌నిపిస్తోంది. మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ కోసం రూ.50 కోట్ల‌ను కేటాయించారు. ఈ కేటాయింపున‌కు సంబంధించిన వివ‌రాల్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు చెప్పిన క్ర‌మంలో.. ఐదు రోజుల తెలుగు పండ‌గకు రూ.50 కోట్లు స‌రిపోవ‌ని.. మ‌రికాస్త నిధులు పెంచుకోవాల‌ని చెప్పిన‌ట్లు చెబుతున్నారు.

అయితే.. త‌మ అంచ‌నాల ప్ర‌కారం రూ.50 కోట్లు స‌రిపోతాయ‌న్న మాట విన్న కేసీఆర్ తాను చెప్పిన మాట‌కు భిన్న‌మైన మాట‌ను చెప్ప‌టంతో న‌వ్వి ఊరుకున్న‌ట్లు తెలుస్తోంది. తీరా.. స‌భ‌లు పూర్తి అయ్యాక జ‌మా ఖ‌ర్చుల లెక్క‌లు చూసుకున్న అధికారుల‌కు కేసీఆర్ ముందుచూపు ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మైందంటున్నారు.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ఖ‌ర్చు విష‌యంలో కేసీఆర్ అంచ‌నా నిజ‌మైంద‌ని.. కేటాయించిన రూ.50 కోట్లకు అద‌నంగా మ‌రో రూ.30 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అంటే.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరిట నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి పెట్టిన ఖ‌ర్చు ఏకంగా రూ.80 కోట్లు కావ‌టం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. మ‌హాస‌భ‌ల‌కు కొద్ది రోజుల ముందు అట్ట‌హాసంగా నిర్వ‌హించిన జీఈఎస్ స‌ద‌స్సుకు.. దీనికి హాజ‌ర‌య్యే ఇవాంక ట్రంప్ వెళ్లే ర‌హ‌దారుల రోడ్లను మెరిసిపోయేలా చేయ‌టం కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టిన వైనం తెలిసిందే. ఈ రూ.100 కోట్ల‌లో రోడ్ల నిర్మాణంతో పాటు.. సుంద‌రీక‌ర‌ణ కూడా ఉందంటున్నారు. జీఈఎస్ కోసం త‌క్కువ‌లో త‌క్కువ రూ.500 కోట్ల‌కు వ‌ర‌కూ ఖ‌ర్చు  పెట్టి ఉంటార‌ని చెబుతున్నారు. ఇన్నేసి కోట్ల రూపాయిలు స‌ద‌స్సుల కోసం..విందుల కోసం..వినోదాల కోసం ఖ‌ర్చు పెట్ట‌టమా?
Tags:    

Similar News