తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు: మేడ్చ‌ల్‌ - కుమ్రం భీం జిల్లా హ‌వా

Update: 2020-06-18 12:19 GMT
వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అతి క‌ష్టంగా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు ఫ‌లితాలు విడుద‌ల చేశారు. ఇక విజ‌య‌వంతంగా వాల్యుయేష‌న్ పూర్తి చేసి ఎట్ట‌ల‌కేల‌కు తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలను విడుద‌ల చేసింది. హైద‌రాబాద్‌లోని ఇంట‌ర్ కార్యాల‌యంలో గురువారం విద్యా శాఖ మంత్రి స‌బితా రెడ్డి ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ప‌రీక్ష‌లు రాసిన వారు 95.72 శాతం మంది. రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో అధికారులు పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 23వ తేదీతో ముగిశాయి. ఈ ప‌రీక్ష‌ల్లో ఫస్టియర్‌లో 60.4 శాతం, సెకండియర్‌లో 68.86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

అన్ని ఫ‌లితాల్లో మాదిరి ఈ ఫ‌లితాల్లోనూ బాలికలు స‌త్తా చాటారు. ఫస్టియర్‌లో బాలికలు 67 శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో బాలికలు 75.15, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ప‌రీక్ష‌ల‌కు 4,80,516 మంది విద్యార్థులు హాజరు కాగా 60.01 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఫ‌లితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలబడ‌గా, రెండో స్థానంలో 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.

సెకండియర్‌లో 4, 85, 323 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా 68.86 శాతం ఉత్తీర్ణత సాధించిచారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానంలో నిలబడగా, 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకుంది. ఈ ఫ‌లితాల్లో గిరిజ‌న ప్రాంతం జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా స‌త్తా చాట‌డం విశేషం. మొద‌టి సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో రెండో స్థానం, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో మొద‌టి స్థానంలో నిల‌వ‌డం హ‌ర్షించే విష‌యం.

Tags:    

Similar News