టీఎస్ ఆర్టీసీ.. కార్మికుల‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు!

Update: 2019-11-03 09:45 GMT
తెలంగాణ ఆర్టీసీ స‌మ్మె ప్రారంభ‌మై దాదాపు నెల రోజులు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు ప్ర‌బుత్వం కానీ - ఇటు కార్మిక సంఘాలు కానీ ఎక్క‌డా మెట్టు దిగి రాక‌పోగా.. రోజు రోజుకు ముడి ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌ధ్య‌లో హైకోర్టు జోక్యం చేసుకున్నా.. న్యాయప‌ర‌మైన విష‌యాల్లో కార్పొరేష‌న్ స్వ‌తంత్ర సంస్థ కనుక‌.. ప్ర‌భుత్వం కూడా త‌ను అనుకున్న రీతిలోనే చ‌ర్చ‌లు తీసుకునే వెసులుబాటు ఏర్ప‌డింది. దీంతో అటు ప్ర‌భుత్వం ఇటు కార్మికులు కూడా స‌మ్మెను తీవ్రంగానే భావిస్తున్నారు. మీ అంత‌ట మీరుగా విర‌మించాల‌ని సంస్థ‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌శ్న లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు, ఉన్న ఉద్యోగులు 49 వేల మందిని రాత్రికి రాత్రి తొల‌గించినట్టు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. కార్మికుల ఆత్మహ‌త్య‌ల‌ను కూడా పెద్ద సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కోర్టుల నుంచి వ‌స్తున్న సూచ‌న‌ల‌ను - చ‌ట్టంలోని లొసుగుల‌ను అడ్డుపెట్టుకుని ప్ర‌భుత్వం రెచ్చిపోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. తాజాగా కార్మికుల‌కు ఓ ఛాన్స్ ఇస్తున్న‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ఈ నెల 5 అర్ధ‌రాత్రి లోగా కార్మికులు భేష‌ర‌తుగా వ‌చ్చి విధుల్లో చేరాల‌ని ఆయ‌న ఆదేశించారు. అలా చేర‌ని ప‌క్షంలో ప్ర‌భుత్వం ఇక చేయాల్సింది ఏమీ లేద‌న్నారు. దీంతో కార్మికుల ప‌రిస్థితి మ‌ళ్లీ అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. ఇన్నాళ్లు జీతాలు లేకపోయినా.. కుటుం బాలు ప‌స్తులు ఉంటున్నా.. త‌మ డిమాండ్ల కోసం రోడ్డెక్కి పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ.. ఇప్ప‌టికీ వారికి సాంత్వన చేకూర‌క‌పోగా.. సీఎం నుంచి ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. దీంతో కార్మికులు న్యాయ‌స్థానం ఆశ్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, వీరికి  నవతెలంగాణ అడ్వకేట్స్‌ ఫోరం అండ‌గా నిలిచేందుకు రెడీ అయింది. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. వారి తరఫున ఉచితంగా వాదించి అండగా ఉంటామని నవతెలంగాణ అడ్వకేట్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుధా నాగేందర్‌ వెల్లడించారు.  కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ స‌మ్మె కొత్త రూపు సంత‌రించుకునే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News