మేకల కాపరికి ఏకే47 ఎలా వచ్చింది?

Update: 2020-02-08 11:35 GMT
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేంద్రంలో ఇటీవల ఏకే 47తో కాల్పులు ఘటన కలకలం రేపింది. అత్యంత అరుదైన ఏకే47 తో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరపడం సంచలనమైంది.

అక్కన్నపేట మండలం కేంద్రంలో ఉండే గంగరాజు , సదానందం మామా అల్లుల్లు..  వీరిద్దరి కుటుంబాల మధ్య చిన్న గొడప పెద్దదైంది. ఈనెల 4న సాయంత్రం సదానందం కత్తి తీసుకొని వచ్చి గంగరాజు ఇంటికెళ్లి చంపుతానని బెదిరించాడు.  దీంతో రగిలిపోయిన సదానందం ఏకంగా ఏకే47 తుపాకీతో గంగరాజు ఇంటికి వచ్చి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గంగరాజు తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

కాల్పులు శబ్ధం విని చుట్టుపక్కల వారు రావడంతో సదానందం పరారయ్యాడు. ఏకే 47తో కాల్పుల ఘటన బయటకు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ జరిపారు. కాల్పులు జరిపిన తూటాల ఖాళీ షెల్స్, సదానందం ఇంట్లో తుపాకీ బెల్ట్, స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు విచారణ జరపగా సంచలన విషయం వెలుగుచూసింది. రెండు సంవత్సరాల క్రితం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఏకే 47, కార్బన్ తుపాకులు మాయమయ్యాయి. సదానందం ఇంట్లో దొరికిన తుపాకీ బెల్ట్ పై అదే తుపాకీ అడ్రస్ రాసి ఉండడంతో ఇది హుస్నాబాద్ స్టేషన్ లో చోరీచేసిన  తుపాకీనే అని పోలీసులు కనిపెట్టారు.

గతంలో ఓ కేసు విషయమై సదానందం తరచూ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చేవాడని.. అతడే చోరీ చేశాడని పోలీసులు గుర్తించారు.తర్వాత సదానందం పదేళ్ల క్రితం అదృశ్యమై ఏడాది క్రితం తిరిగి వచ్చి మేకలు కాస్తూ జీవిస్తున్నాడు. ఈ పదేళ్లలో మావోయిస్టులతో సంబంధం పెట్టుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సదానందంను పట్టుకున్నారు. కార్బన్ తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.


Tags:    

Similar News