మహబూబ్ నగర్ కు సాధ్యమైంది.. తెలంగాణ మొత్తం అమలు చేయొచ్చుగా కేసీఆర్?

Update: 2021-05-24 13:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే మరణాలకు ఏ మాత్రం సంబంధం లేని విధంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఎంతలా అంటే.. అంత్యక్రియల కోసం వెయింటింగ్ పిరియడ్ నడుస్తోంది.

అంతేనా.. మరణించిన వారి దహన సంస్కారాల కోసం వేలాది రూపాయిలు డిమాండ్ చేస్తున్న దుస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవ తీసుకొని.. కొవిడ్ తో మరణించిన వారి అంతిమ సంస్కారాల కోసం మహబూబ్ నగర్ లో రూ.5కే దహన సంస్కారాల్ని పూర్తి చేస్తామని చెప్పారు.

మరణించిన కుటుంబ సభ్యులకు దహన సంస్కారాలు భారంగా మారకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్లుగా రూ.5 దహన సంస్కారాలుపూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవటం బాగానే ఉన్నా.. అదొక్క మహబూబ్ నగర్ కే ఎందుకు పరిమితం కావాలి? తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయకూడదన్నది ప్రశ్న?

కరోనాతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.చికిత్స కోసమే వేలాది రూపాయిల్ని.. ఏ మాత్రం తీవ్రత ఎక్కువ ఉన్నా లక్షల్లో ఖర్చు వస్తునన దుస్థితి. ఇలాంటివేళ.. ఎవరైనా దురద్రష్టవశాత్తు మరణిస్తే.. అంతిమ సంస్కారాల కోసం రూ.40 నుంచి రూ.70వేల మధ్య వసూలు చేస్తున్న ఉదంతాలు బయటకు వస్తున్నాయి.

ఇలాంటివేళ.. ఆర్థిక భారం పడకుండా రూ.5లకే దహన సంస్కారాలు పూర్తి అయ్యేలా నిర్ణయం తీసుకోవటం బాగానే ఉన్నా.. అదొక్క మహబూబ్ నగర్ కు పరిమితం చేయకుండా.. తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలన్నమాట వినిపిస్తోంది. మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ మాటలు వినిపిస్తాయా?
Tags:    

Similar News