ఢిల్లీ వెళ్లి మ‌రీ ప‌రువు తీసుకోవాలా?

Update: 2021-11-15 02:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేవు. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల దాడితో ప‌రిస్థితికి రోజురోజుకూ దిగ‌జారుతోంది. రాష్ట్రంలో పంచాయ‌తీ స‌రిపోద‌న్న‌ట్లు.. ఢిల్లీ వెళ్లి మ‌రీ ప‌రువు తీసుకుంటున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం పార్టీలో ర‌గిల్చిన చిచ్చు ఇప్ప‌ట్లో ఆరేలా లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలో దిగిన బ‌ల్మూరి వెంక‌ట్ క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయాడు. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ కాంగ్రెస్‌కు సుమారు 60 వేల ఓట్లు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3 వేల‌కే ప‌రిమిత‌మ‌వ‌డంతో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు.

మ‌రోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పార్టీ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌పై అధిష్ఠానం కూడా ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఈ  ఓట‌మిపై స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించి ఆ బాధ్య‌త‌ను ఏఐసీసీ ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ కేసీ వేణుగోపాల్‌కు అప్ప‌గించింది. దీంతో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్త‌మ‌కుమార్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వీహెచ్, భ‌ట్టి విక్ర‌మార్క, ష‌బ్బీర్ అలీ లాంటి  సీనియ‌ర్ నాయ‌కులుతో పాటు ఇత‌ర నేత‌ల‌ను బ‌ల్మూరి వెంక‌ట్‌ను ఢిల్లీకి పిలిపించి వాళ్ల‌తో కేసీ వేణుగోపాల్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర వ్యాఖ్య‌లు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఉప ఎన్నిక ఫ‌లితంపై ఒక్కొక్క‌రి అభిప్రాయాన్ని కోరిన కేసీ వేణుగోపాల్ కూడా నేత‌ల వైఖ‌రి ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది.

అభ్య‌ర్థి ఎంపిక‌లో ఆల‌స్యం, హుజూరాబాద్‌లో 1983 నుంచి కాంగ్రెస్ గెల‌వ‌లేక‌పోవ‌డం, ధ‌న ప్ర‌భావం లాంటి విష‌యాలు ప్ర‌భావం చూపాయ‌ని రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లు తెలిసింది. ఈట‌ల రాజేంద‌ర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుందామంటే కొంద‌రు వ్య‌తిరేకించారని కేసీ వేణుగోపాల్‌కు భ‌ట్టి చెప్పార‌ని స‌మాచారం. కానీ భ‌ట్టి మాట‌లకు కేసీ వేణుగోపాల్ వ్య‌తిరేకించారు. ఈట‌ల చేరిక‌ను వ్య‌తిరేకిస్తూ భ‌ట్టినే త‌న‌తో మాట్లాడిన విష‌యాన్ని మ‌ర్చిపోయారా అని ప్ర‌శ్నించారు. మీ త‌ప్పుల‌ను ఎందుకు ఇత‌రుల‌పై నెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భ‌ట్టిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. బీజేపీలో ఈట‌ల చేర‌కముందు ఆయ‌న భ‌ట్టితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం సంగ‌తి బ‌య‌ట‌కు తెలియ‌గానే తొంద‌ర‌ప‌డ్డ బీజేపీ.. ఈట‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంది. ఈట‌ల విష‌యంలో ఆల‌స్యం చేశార‌ని నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తాజా స‌మావేశంలో వేణుగోపాల్ అందుకే వ్యాఖ్యానించారు.

ఈ స‌మావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ని స‌మాచారం. గ‌తంలో హుజూరాబాద్లో పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న స‌మ‌యంలో కౌశిక్‌రెడ్డికి ఆయ‌న సోద‌రుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధిక ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని పొన్నం అన్నారు.  త‌న త‌మ్ముడిపై ఉత్త‌మ్ చూపిన ధృత‌రాష్ట్ర ప్రేమే అక్క‌డ పార్టీని ఇప్పుడు ముంచింద‌ని పొన్నం తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌రైన స‌మ‌యంలో కౌశిక్ కాంగ్రెస్‌ను వీడి  టీఆర్ఎస్‌లో చేర‌డం వెన‌క ఎవ‌రి హ‌స్తం ఉందో తెలుస‌న్న‌ట్లు మాట్లాడారు. ఈ విమ‌ర్శ‌ల‌పై ఒక్క‌సారిగా ఉత్త‌మ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో వార్‌రూమ్‌లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింద‌ని తెలిసింది.  ఉత్త‌మ్ ప‌రుష ప‌దుజాలం మాట్లాడ‌డంతో పొన్నం కూడా అందుకు దీటుగానే బ‌దులిచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ స‌మీక్ష స‌మావేశానికి త‌న‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై జ‌గ్గారెడ్డి వేణుగోపాల్‌కు లేఖ రాశారు.
Tags:    

Similar News