ముగ్గురిలో ఫ్యూచర్ ఎవరిదో ?

Update: 2021-09-08 10:14 GMT
తెలంగాణా రాజకీయాలు మొత్తం ముగ్గురు యువనేతల చుట్టే తిరుగుతున్నాయి. వారే కేటీయార్, రేవంత్ రెడ్డి, బండిసంజయ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురిలో ఒకరేమో తండ్రి చాటు కొడుకుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఇపుడు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇక రేవంత్ ఏమో చాలా స్పీడుగా రాజకీయాల్లో ఎదుగుతున్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి జోరుమీదున్నారు. ఇక మూడో నేత బండి సంజయ్ ఏమో కేంద్రంలో ఎన్డీయేకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ కారణంగా రాష్ట్రంలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

కేటీయార్ విషయం తీసుకుంటే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చివరి మజిలీలో అమెరికా నుండి వచ్చి జాయిన్ అయ్యారు. ఈయన పొలిటికల్ ఎంట్రీకి ముందే కేసీయార్ కొడుకనే ట్యాగ్ ఉండటంతో వెనక్కు చూసుకోవాల్సిన అవసరం కానబడలేదు. దానికితోడు 2014 లో ప్రత్యేక తెలంగాణా తర్వాత అధికారం కూడా దక్కటంతో కాబోయే యువరాజుగా ప్రచారంలో ఉన్నారు. ఇప్పటికే సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన కేటీయార్ అనధికారికంగా అదే హోదాను హ్యాపీగా అనుభవిస్తున్నారు.

అయితే తండ్రి కేసీయార్ లాగే ఈయనకు కూడా మాటకారితనం వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలను అనర్గళంగా మాట్లాడగలగడం బాగా కలిసొచ్చే అంశం. ఇక రేవంత్ విషయం చూస్తే మొదటి నుంచి మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్నారు. విషయ పరిజ్ఞానం ఉండటం, తెలుగు, హిందీ భాషాలను చక్కగా మాట్లాడగలరు కాబట్టి జాతీయస్థాయిలో చొచ్చుకుపోతున్నారు. జనాల్లో ప్రధానంగా యూత్ లో రేవంత్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. రేవంత్ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాతే పార్టీ నేతలు, శ్రేణుల్లో మంచి జోష్ కనబడుతోందనే చెప్పాలి.
చివరగా బండి సంజయ్ గురించి చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ అధికారాన్ని చూసుకునే ఇక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే స్తబ్దుగా ఉన్న పార్టీకి బండి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే స్పీడు పెరిగింది. 24 గంటలూ, ప్రతి విషయంలోను నేరుగా కేసీయార్ ను టార్గెట్ చేయడం ద్వారా పార్టీలో జోష్ నింపుతున్నారు. ఎంఐఎంకు ధీటుగా నువ్వా నేనా అనే పద్ధతిలో రాజీకీయాలు చేస్తుండటంతో పాతబస్తీలో కూడా పార్టీ పర్వాలేదనే స్ధాయికి తీసుకొచ్చారు. ఈయన కూడా తెలుగు, హిందీ భాషలను బాగా మాట్లాడగలరు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో ఎవరికి మంచి భవిష్యత్తుందో జనాలు తేల్చేయబోతున్నారు.


Tags:    

Similar News