తెలంగాణలో కాపుల కల సాధ్యమవుతుందా?

Update: 2022-05-16 09:49 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది.. కాపు సామాజికవర్గం. రాష్ట్రంలో అత్యధిక సామాజికవర్గం (దాదాపు 25 శాతం) కాపులే కావడం గమనార్హం. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఈ సామాజికవర్గం అధికారంలోకి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ రూపంలో కాపు సామాజికవర్గం అధికారంలోకి రావడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో కంటే ముందు తెలంగాణలోనే కాపులు రాజ్యాధికారం చేపట్టాలని భావిస్తున్నారు. ఆంధ్రాలో ఓసీలు, బీసీలు (ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు)గా ఉన్న కాపులు తెలంగాణలో మున్నూరు కాపులుగా బీసీల్లో ఉన్నారు. వివిధ పార్టీల్లో కీలక హోదాల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కొండా మురళి తదితరులు, టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ సభ్యులు.. కేశవరావు, డి.శ్రీనివాస్, ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, దాస్యం వినయ్‌ భాస్కర్, వనమా వెంకటేశ్వరరావు, మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే.

ఇక అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కూడా మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఇలా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల్లో వివిధ పార్టీల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.. మున్నూరు కాపులు.

వచ్చే ఏడాది (2023) డిసెంబర్‌కు తెలంగాణలో ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువు తీరిపోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ మధ్య సంకుల సమరం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల తరఫున రాహుల్‌ గాంధీ, అమిత్‌ షా పర్యటించి తెలంగాణ రాజకీయాలను పుల్లుగా హీటెక్కించేశారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కాకుండా ఇంకా కమ్యూనిస్టు పార్టీలు, చిన్నచితకా పార్టీలు ఉన్నాయి. అయితే.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని పలు విశ్లేషణుల చాటి చెబుతున్నాయి.

ప్రస్తుతానికి బీజేపీ కూడా పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌ – టీఆర్‌ఎస్‌ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ వంటి ప్రాంతాల్లోనే బీజేపీ బలంగా ఉందని అంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి నాయకత్వ లేమి ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, సిద్ధిపేట, వేములవాడ తదితర జిల్లాల్లో బీజేపీకి అసలు నాయకులే లేరని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ బలపడి  విజయం సాధిస్తే తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని కాపులు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేదా నిజామాబాద్‌ ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చాన్స్‌ ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో వీరిద్దరితోపాటు గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణను చుట్టేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. మరోవైపు ధర్మపురి అరవింద్‌ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బహిరంగ సభల్లోనూ, సోషల్‌ మీడియా వేదికగానూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరు కాపులు తమ ఆశలన్నీ బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లపైనే పెట్టుకున్నారు.
Tags:    

Similar News