నిమజ్జనంపై సుప్రీంను ఆశ్రయించేందుకు టీసర్కార్ సై

Update: 2021-09-14 03:26 GMT
ఒకవైపు రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ.. మరోవైపు అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది తెలంగాణ సర్కారు. పైకి బింకాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఈ రెండు పార్టీల జోరు అధికార టీఆర్ఎస్ కు కొత్త భయాన్ని తీసుకొచ్చిందన్న మాట వినిపిస్తోంది. గతంలో మాదిరి.. ఏ చిన్న విషయాన్ని వదిలే పరిస్థితి లేదని.. చిన్న తప్పునకు పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నట్లుగా ఇప్పుడు పార్టీలో ఉందన్న మాట వినిపిస్తోంది.

అందుకే.. భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో గతంలో మాదిరి చూసిచూడనట్లుగా కాకుండా.. చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పాలి. గణేజ్ నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో నిర్వహించే అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. నిమజ్జనంతో సెంటిమెంట్ ముడి పడి ఉండటం.. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. తాము పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. శనివారం ఆదేశాలు వెలువడిన వెంటనే.. సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అక్కడా చుక్కెదురు కావటమే కాదు.. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిన హైకోర్టు ధర్మాసనం దెబ్బకు కేసీఆర్ సర్కారుకు ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది.

హైకోర్టు ఆదేశాల్ని తూచా తప్పకుండా అనుసరిస్తే.. తనకు ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా ఈ ఉదంతంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని.. టీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా సమావేశమై.. చర్చించటం గమనార్హం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హైకోర్టు తీర్పుపై సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని.. అందుకు తగ్గ కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News