ఏపీ బాట‌లో టీజీ : ఆహా! బంగారు తెలంగాణ‌మా!

Update: 2022-04-20 03:30 GMT
ఆదాయం ఘ‌నం .. మిగులు నిధులు ఉన్న రాష్ట్రం.. మ‌న కేసీఆర్ స‌ర్ భాష‌లో చెప్పాలంటే గోడు మ‌న‌దే గోస మ‌న‌దే అన్న విధంగా ప్ర‌త్యేక పాల‌న.. ప్ర‌త్యేక రాష్ట్రం..బంగారు క‌ల‌లు  ఫ‌లించి వ‌చ్చిన బంగారు తెలంగాణ కానీ అంగ‌ట్లోన అన్నీ ఉన్న‌య్ కానీ అప్పులు మాత్రం య‌థాత‌థంగా అదేవిధంగా ఉన్నాయి.

ఏవీ క‌ద‌ల‌డం లేదు ఏవీ తేల‌డం లేదు కానీ అవ‌స‌రం ఉన్నా లేకపోయినా కొత్త స‌చివాల‌య నిర్మాణానికి సంబంధిత ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కు మాత్రం ఆయ‌న ఎక్క‌డ లేని శ్ర‌ద్ధ చూపించి నిధులు వెచ్చించి నిర్మిస్తుండడం విస్మ‌య‌దాయ‌కం అని విప‌క్షాలు పెద‌వి విరుస్తున్నాయి. యాదాద్రి నిర్మాణానికి కూడా వెయ్యి కోట్లు దాటించి వెచ్చించిన దాఖ‌లాలు ఉన్నాయి..

పోనీ అదొక టూరిజం వెంచ‌ర్ అనుకున్నా ఆశించిన రీతిలో రిజిస్ట్రేష‌న్ల ప‌రంగా కానీ ఇత‌ర రియ‌ల్ వెంచ‌ర్ల పరంగా కానీ ఆదాయం రావాలంటే మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయం. ఎలా చూసుకున్నా ఓ మెట్రో రైలుకు త‌క్కువ‌లో త‌క్కువ ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను అప్పు రూపంలో కూడా స‌ర్ద‌డానికి ఇష్టప‌డని కేసీఆర్ ఎందుక‌ని ఆడంబ‌రాల‌కు పోతున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆర్థిక వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

నాలుగు ల‌క్ష‌ల కోట్ల అప్పు
నెల‌కు  ఏడు వేల  కోట్ల లోటు
వ‌స్తున్న ఆదాయం 12 వేల కోట్లు
ఖ‌ర్చులు అన్నీ క‌లుపుకుంటే 19 వేల కోట్లు
ఏడాదికి లోటు 84 వేల కోట్లు ఓ లెక్క‌న
మూడేళ్లుగా లోటు 2 ల‌క్ష‌ల 52 వేల కోట్లు

ఇది మూడేళ్లు లెక్క.. మ‌రి ఎనిమిదేళ్లుగా ఇదే స్థాయిలో స‌మ‌స్య‌లున్నాయా? లేదా ఇప్ప‌టికిప్పుడు స‌మ‌స్య‌లు పుట్టుకువ‌చ్చాయా? తెచ్చిన అప్పుల‌కూ వాటికి చెల్లించాల్సిన వ‌డ్డీల‌కూ లెక్క‌లు తేల్చేస‌రికే తెలంగాణ స‌ర్కారుకు ఉన్న స‌మ‌యం స‌రిపోతుంది. ఇప్ప‌టికే ఆస‌రా పెన్ష‌న్లు స‌కాలంలో రావ‌డం లేద‌ని వాపోతున్నారు సంబంధిత ల‌బ్ధిదారులు.

ఔట్ సోర్సింగ్ మ‌రియు కాంట్రాక్టు ఉద్యోగుల‌కూ మూడు నెలలుగా జీతాల్లేవు. ఈ త‌రుణాన ఏపీ క‌న్నాఎక్కువ సంప‌ద ఉన్న రాష్ట్రంలో ఈ అప్పుల తిప్ప‌లేంటో ? ఏపీలో పెన్ష‌న్ లు 61 ల‌క్ష‌లు.. తెలంగాణ‌లో పెన్ష‌న్ 36 ల‌క్ష‌లు.. ఏ విధంగా చూసుకున్నా కూడా సామాజిక పింఛ‌న్ల వ‌ర్తింపులో కూడా ఏపీ యంత్రాంగం టీజీ క‌న్నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది.

ఇవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కొత్త‌గా ఆర్బీఐకు 15 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు రుణం కావాలి అని ప్ర‌తిపాద‌న‌లను టీ స‌ర్కారు పంపింది. ఇప్ప‌టిదాకా చేసిన అప్పుల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీల విలువే 1850 కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది. ఇది ఒక నెల‌కు అంటే ఏడాదికి 22,200 కోట్లు కేవ‌లం  వడ్డీల‌కే చెల్లిస్తుంద‌ని తేలింది.

పోనీ ఈ మూడేళ్ల లెక్క తీసుకున్నా  అప్పు విలువ ఎంత ? వ‌డ్డీ విలువ ఎంత అన్న‌ది కూడా లెక్క‌లు తీస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం. 2018 డిసెంబ‌ర్ 13 నుంచి ఇప్ప‌టిదాకా ఎన్నో స‌వాళ్ల‌ను కేసీఆర్ రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యాక చవి చూశారు లేదా ఎదుర్కొన్నారు. క‌నుక పూర్తైన మూడేళ్ల‌కే లెక్క‌లు రాస్తున్నా కూడా అప్పుల తిప్ప‌ల‌పై ప్ర‌భుత్వానికి అస్స‌లు బెంగే లేదు. అవి ఎలా తీరుతాయి అన్న బెంగ అస్స‌లు లేదు.. అని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.
Tags:    

Similar News