తెలంగాణ బ‌డ్జెట్ లెక్కల లోతుల్లోకి వెళితే..

Update: 2018-03-15 16:31 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌రుస‌గా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అరుదైన అవ‌కాశం ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ కు  ద‌క్కింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ఆయ‌న‌.. ఆర్థిక‌మంత్రిగా ఇప్ప‌టివ‌ర‌కూ బండి బాగానే లాక్కొచ్చారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ప్ర‌వేశ పెట్టిన చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ గా 2018-19 బ‌డ్జెట్‌ను చెప్పాలి. తాను ప్ర‌వేశ పెట్టింది ఎన్నిక‌ల బ‌డ్జెట్ కాద‌ని.. ప్ర‌జాక‌ర్ష‌క బ‌డ్జెట్ గా పేర్కొన్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్షేమం.. అభివృద్ధి ఫ‌లాల్ని ప్ర‌జ‌ల‌కు అందించాల‌న్న ఆశ‌యానికి అద్దం ప‌ట్టేలా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. స‌మైక్య రాష్ట్రంలో ఉన్న జీడీపీ వృద్ధిరేటును తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికేడాది పెరుగుతూ వ‌చ్చింద‌న్నారు. 2013-14లో 5.4 శాతం మాత్ర‌మే ఉన్న జీడీపీ వృద్ధిరేటు రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత పెరుగుతోందంటూ అంకెల్ని ఉటంకించారు. 2016-17లో వృద్ధిరేటు 10.1 శాతంగా చెప్పిన ఆయ‌న 2017-18లో వృద్ధిరేటు అంత‌కు మించి మ‌రింత‌పెరుగుతూ 10.4 శాతానికి చేరుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

రెండెంక‌ల వృద్ధిరేటును సాధించ‌టం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. జాతీయ వృద్ధిరేటుతో పోలిస్తే.. రాష్ట్ర వృద్ధిరేటు మెరుగ్గా ఉంద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో అభివృద్ధి 2017-18లో 6.9 శాతానికి చేరుకుంద‌న్నారు.

తాజా బ‌డ్జెట్ ను రూ.1,74,453.84కోట్ల‌తో ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఈటెల ప్ర‌క‌టించారు. రెవెన్యూ వ్య‌యం 1,25,453.70 కోట్లు కాగా.. రెవెన్యూ మిగులు రూ.5520.41 కోట్లుగా ఉంద‌న్నారు. పెట్టుబ‌డి వ్య‌యం రూ.33.69వేల కోట్లుగా పేర్కొన్న ఆయ‌న‌.. పంట పెట్టుబ‌డి ప‌థ‌కానికి రూ.12వేల కోట్లు.. రైతు బీమా ప‌థ‌కానికి రూ.500 కోట్లు.. వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ కోసం రూ.552 కోట్లు.. బిందు సేద్యానికి రూ.127 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.29,041.88 కోట్లుగా చెప్పారు.

తెలంగాణ‌లో త‌ల‌స‌రి ఆదాయం రూ.1,75,534గా పేర్కొన్నారు. ఎక‌రానికి రూ.4వేల చొప్పున రెండు పంట‌ల‌కు పెట్టుబ‌డి సాయాన్ని అందిస్తామ‌న్న ఈటెల‌.. ఈ ప‌థ‌కంతో వ‌ల‌స బ‌తుకుల నుంచి వ్య‌వ‌సాయ ప్ర‌గ‌తి దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపిస్తామ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

బడ్జెట్ కేటాయింపులు ఇవే:

రూ.15 వేల కోట్లకు పైనే కేటాయింపులు

+ సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.25 వేల కోట్లు

+ వ్యవసాయం - మార్కెటింగ్‌ కు రూ.15,780 కోట్లు

+ పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు

రూ.10 వేల కోట్ల‌కు పైనే కేటాయింపులు

+ ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లు

+ పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు

రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మ‌ధ్య కేటాయింపులు

+ ఎస్సీ - ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9693 కోట్లు

+ ఎస్టీల అభివృద్ధి శాఖకు రూ.8063 కోట్లు

+ వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375 కోట్లు

+ పట్టణాభివృద్ధిశాఖకు రూ. 7251 కోట్లు

+ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.5920 కోట్లు

+ హోంశాఖకు రూ. 5790 కోట్లు

+ విద్యుత్‌ రంగానికి రూ.5,650 కోట్లు

+ రోడ్లు - రవాణా - భవణాలకు రూ.5,575 కోట్లు

+ ఆసరా పెన్షన్లకు రూ.5300 కోట్లు

రూ.3వేల కోట్ల లోపు కేటాయింపులు

+ పౌరసరఫరాలశాఖకు రూ.2946 కోట్లు

+ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు రూ.2823 కోట్లు

+ డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ.2643 కోట్లు

+ ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు

+ మైనార్టీ సంక్షేమానికి రూ.2వేల కోట్లు

రూ.2వేల కోట్ల లోపు కేటాయింపులు

+ మిషన్‌ భగీరథకు రూ.1801 కోట్లు

+ మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు

+ పంచాయతీలకు రూ.1500 కోట్లు

+ దళితులకు భూపంపిణీకి రూ.1469 కోట్లు

+ కల్యాణలక్ష్మి - షాదీముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు

+ పరిశ్రమలు - వాణిజ్యశాఖకు రూ.1286 కోట్లు

+ చేనేత - టెక్స్‌ టైల్‌ రంగానికి: రూ.1200 కోట్లు

రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వ‌ర‌కు కేటాయింపులు

+ ఎంబీసీ కార్పొరేషన్‌ కు రూ.1000 కోట్లు

+ మున్సిపాలిటీలు - కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు

+ అమ్మ ఒడి పథకానికి రూ.561 కోట్లు

రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల లోపు కేటాయింపులు

+ ఇతర కార్పొరేషన్ల అభివృద్ధికి రూ. 400 కోట్లు

+ వరంగల్‌ నగర అభివృద్ధికి రూ. 300 కోట్లు

+ ఆరోగ్యలక్ష్మి పథకానికి రూ.298 కోట్లు

+ ఐటీ శాఖకు రూ.289 కోట్లు

+ నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు

+ రజక ఫెడరేషన్కు రూ.200 కోట్లు

రూ.100 కోట్ల వ‌ర‌కు కేటాయింపులు

+ కోల్డ్‌స్టోరేజీ - లింకేజీలు రూ.132 కోట్లు

+ పాలీహౌస్‌ - గ్రీన్‌ హౌస్‌ కు రూ.120 కోట్లు

+ ఫౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు

+ వేములవాడ దేవాయం అభివృద్ధికి రూ. 100 కోట్లు

+ భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు

+ బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు

+ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు

+ అర్చకుల జీతభత్యాలకు రూ. 72 కోట్లు

+ సాంస్కృతికశాఖకు రూ. 58 కోట్లు

+ బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు

+ ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు

+ సీజీఎఫ్‌ కు రూ. 50 కోట్లు

Tags:    

Similar News