ఆశ్చర్యం: హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ టీడీపీ

Update: 2021-09-30 08:32 GMT
తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైంది. ఆ పార్టీలో ఉన్న నేతలంతా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. టీడీపీలో కీలక నేత రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే నేతలంతా జారిపోయిన వేళ కూడా తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు టీడీపీ ముందుకు రావడం విశేషం.

పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే తెలంగాణ తెలుగుదేశం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. టి-టిడిపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంబటి జోజిరెడ్డి దీన్ని ధృవీకరిస్తూ హుజూరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. "ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మా అధినేత చంద్రబాబు నాయుడు మా పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారు" అని జోజిరెడ్డి ప్రకటించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికార టీఆర్ఎస్, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హుజూరాబాద్ బరిలో టీడీపీ నిలవడం నిజంగా ఆశ్చర్యకరమైనది.. వింతైనది. తెలంగాణ టిడిపికి అసలు క్యాడర్ లేదు. ప్రముఖ నాయకులందరూ పార్టీని వీడారు. ఈ పరిస్థితుల్లో, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం నిజంగా ధైర్యమైన నిర్ణయం మనే చెప్పాలి.

అయితే తెలంగాణ టీడీపీని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? కనీసం డిపాజిట్ అయినా ఇస్తారా? లేదా అని డౌట్ పడుతున్నారు. మరొక అవమానకరమైన ఓటమిని టీడీపీకి దక్కుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా పార్టీ తన క్యాడర్‌పై పని చేయాలని.. బలంగా ఎదగాలని వారు సూచిస్తున్నారు.

అక్టోబర్ 30న హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఫలితాలు నవంబర్ 2 న ప్రకటించబడతాయి. మరి టీడీపీకి కనీసం డిపాజిట్ వస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.




Tags:    

Similar News