కేసీఆర్ మాటే కేసీఆర్ శ‌త్రువు

Update: 2017-02-06 08:23 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తెలంగాణ తెలుగు దేశం విమర్శల దాడిని పెంచాలని భావిస్తోంది. ఇందుకు కోసం కాస్త భిన్నమైన ప్లాన్ వేసినట్లుగా చెప్పాలి. కేసీఆర్ మాటల్ని ఎంతగా విమర్శించినా.. ఆయన కానీ నోరు విప్పి.. తన వాదనను వినిపిస్తే.. అప్పటివరకూ వినిపించిన విమర్శలన్నీ హుష్ కాకి అయినట్లే. అందుకే.. కేసీఆర్ మాటలకు ఆయన మాటల్నే కౌంటర్ గా వేసేలా ఒక సీడీని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేయనున్నారు.

ఉద్యమనేతగా మొదలు.. సార్వత్రిక ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత వివిధ అంశాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కేసీఆర్ తాను చెప్పిన మాటల్ని మర్చిపోయి.. ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసం కేసీఆర్ నాడు.. నేడు అన్న పేరుతో ఒక వీడియోను సిద్ధం చేస్తున్నారు.

కీలకమైన అంశాల విషయంలో గతంలో కేసీఆర్ చేసిన వాదన.. అందుకు పూర్తి భిన్నమైన వాదనను వినిపించిన కేసీఆర్ రెండు మాటల్ని కలిపి.. నాడు – నేడు సీడీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కేసీఆర్ ఇమేజ్ ను.. కేసీఆర్ చెప్పిన మాటలతోనే డ్యామేజ్ చేయాలన్నది టీ టీడీపీ నేతల ఆలోచనగా చెప్పాలి.

రైతుల రుణమాఫీ అంశం మీదా.. నాటి ముఖ్యమంత్రి నివాసాల మీద.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిపించే ఉదంతం మీద కేసీఆర్ నాడుచెప్పిందేమిటి? నేడు చేస్తున్నదేమిటన్నది అందరికి ఇట్టే అర్థమయ్యేలా ఈ సీడీ ఉంటుందనిచెబుతున్నారు. కేసీఆర్ మీద తాము ఒక్క విమర్శ చేయకుండా ఒకే అంశం మీద కేసీఆర్ ఎంతలా మాటలు మార్చేస్తారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఈ సీడీ ఉంటుందని చెబుతున్నారు. పది అంశాల మీద సీడీని తయారు చేసి ప్రజల్లోకి భారీగా తీసుకెళ్లాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి.. ఈ సీడీ బయటకు వచ్చాక సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News