మోడీని ప‌వ‌న్ అందు కోస‌మే క‌లుస్తున్నాడా?

Update: 2020-01-13 09:17 GMT
జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ చాన్నాళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌న్నుగీటుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఆ మ‌ధ్య అమిత్ షాను పొగ‌డ‌టం, హిందుత్వ వాదిలా మాట్లాడ‌టం.. ఇవ‌న్నీ కూడా బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌య‌త్నాలు అనే అభిప్రాయాలు వినిపించాయి. సొంతంగా పార్టీని న‌డ‌ప‌టం అంటే మాటలు కాదు. చంద్ర‌బాబు నాయుడుని న‌మ్ముకుని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్కువ‌కాలం రాణించే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డే ఇబ్బందిక‌రంగా కొన‌సాగుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ప‌వ‌న్ ను చంద్ర‌బాబు నాయుడు కాపాడుకునేంత సీన్ ఏమీ లేదు. ఇలాంటి నేప‌థ్యంలో  ప‌వ‌న్ కు బీజేపీనే మార్గం అవుతూ ఉంది.

అయితే బీజేపీ ప‌వ‌న్ ను సోలోగా కొన‌సాగించేందుకు ఏ మాత్రం ఒప్పుకోదు. విలీన‌మే ఆ పార్టీ ప్ర‌తిపాద‌న అవుతుంది. ప‌వ‌న్ త‌ను సొంతంగా కొన‌సాగుతూ బీజేపీతో స్నేహంగా ఉండాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. కానీ బీజేపీ అధినాయ‌క‌త్వం అందుకు ఒప్పుకునే ప్ర‌స‌క్తి ఉండ‌దు. ఏ పార్టీని అయినా మింగేయాల‌నే బీజేపీ చూస్తుంది. అలాంటిది ఎమ్మెల్యేగా కూడా రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ ఎంట‌ర్ టైన్ చేసే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.

అయితే విలీనం చేస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా విమ‌ర్శ‌ల పాల‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌జారాజ్యం వెళ్లి కాంగ్రెస్ లో విలీనం అయ్యింది, జ‌న‌సేన వెళ్లి బీజేపీలోకి అనే విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తాయి. ఆ విలీనం వ‌ల్ల బీజేపీ కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప‌క ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే.. జ‌న‌సేన అధిప‌తి ఎటు తిరిగీ పొత్తుతో ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

రాజ‌ధాని అంశాన్ని అడ్డం పెట్టుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీ, బీజేపీల పొత్తు గురించి మోడీ, అమిత్ షాల‌తో చ‌ర్చించాల‌నే ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌హ‌స్యం ఇదే అనే అభిప్రాయాలు ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News