హైదరాబాద్ లో హిజాబ్ ఇష్యూ అంటూ తెలుగు చానల్ అతి?

Update: 2022-04-14 02:31 GMT
తెలిసితెలియని సమచారంతో ఏదో సంచలనం చేయాలన్న అత్యుత్సాహం కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులకు కారణమవుతుందన్న విషయాన్ని చెప్పే ఉదంతమిది. లేని ఇష్యూను.. తమకున్న ఊహాశక్తితో అల్లేసుకొని.. వార్తలుగా మార్చేసే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి కారణంగా ఆయా మీడియా సంస్థల పేరు ప్రతిష్ఠలు దారుణంగా దెబ్బ తింటూ ఉంటాయి. తాజాగా అలాంటిదే జరిగింది. తెలుగు న్యూస్ చానళ్లలో పేరున్న ఒక చానల్ లో బుధవారం సాయంత్రం వేళలో ఒక వార్త ప్రసారమైంది. దాని సారాంశం.. హైదరాబాద్ పాతబస్తీలో భాగమైన బహదూర్ పుర గౌతమ్ మోడల్ స్కూల్ లో హిజాబ్ ధరించలేదన్నఒక విద్యార్థిని స్కూల్ యాజమాన్యం అనుమతించలేదని.. దీనిపై తోటి విద్యార్థినులు ఆందోళన చేస్తే.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నది సారాంశం.

ఇలాంటి సున్నితమైన అంశాలపై సమాచారం అందిన వెంటనే.. దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం.. నిజంగానే అలాంటి పరిస్థితి సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నతో పాటు.. దానికి సంబంధించి పోలీసు శాఖలోని అధికారులతో ఒకటికి రెండుసార్లు మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అలాంటి వార్తల్ని టెలికాస్టు చేయాలి. కానీ.. అదేమీ చేయకుండానే చేసిన తీరుతో.. సదరు ఛానల్ లో రావటం.. దాన్ని అందిపుచ్చుకొని.. వేరే చానళ్లు కొన్ని అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. పనిలో పనిగా.. చానళ్లలోపడే బ్రేకింగుల ఆధారంగా వార్తలు రాసేటోళ్లు కొంత  రాశారు.

కానీ.. కాసేపటికే అందులో నిజం లేదని.. జరిగింది ఒకటైతే.. సదరు చానల్ అతితో ఇష్యూ పూర్తిగా మారిపోయిందన్న విషయం తేలింది. స్కూల్ లో పదిహేనేళ్లుగా పని చేసే ఇస్మాయల్ అనే పీటీ మాష్టారు.. పదిహేను రోజులుగా స్కూల్ కు రావటం లేదు. దీంతో.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతగాడ్ని వేరే బ్రాంచ్ కు బదిలీ చేస్తూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

దీంతో కొందరు విద్యార్థులు తమకు పీటీ సారుగా ఇస్మాయిలే కావాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
తనను అకారణంగా బదిలీ చేశారంటూ ఇస్మాయిల్ వాపోవటంతో స్కూల్ విద్యార్థులు మాష్టారికి అండగా నిలుస్తూ ఆందోళన చేశారు. ఇది కాస్తా పెద్దది కావటంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు.. ఆందోళనకారుల్ని చెదరగొట్టే పనిలో భాగంగా లాఠీ ఛార్జి చేశారు. జరిగింది ఇదైతే.. దానికి భిన్నంగా  విద్యార్థిని హిజాబ్ అంటూ లేని ఇష్యూను క్రియేట్ చేస్తూ ఒక చానల్ అతి వికారం కలిగించేలా మారింది.

వాస్తవానికి ఇలాంటి గాలి వార్తలు వేగంగా వ్యాప్తి చెందిన అనవసర లొల్లికి కారణమవుతూ ఉంటాయి. లక్కీగా.. ఈ సోది వార్త తెలుగులో కావటంతో ఇష్యూ మరింత పెద్దది కాలేదు. ఒకవేళ.. ఇదే వార్త ఉర్దూలో టెలికాస్ట్ అయి.. అది కాస్తా వైరల్ గా మారితే పరిస్థితి ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. సున్నితమైన వార్తల్నిప్రసారం చేసేటప్పుడు.. దాని గురించి చెప్పేటప్పుడు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్నింటికి మించి.. పాతబస్తీలో ఇలాంటిది ఏమైనా జరిగితే.. మరుక్షణంలో మజ్లిస్ నేతలు రంగంలోకి వస్తారు. వారు సైతం సంయమనం పాటిస్తూ.. గాలి వార్తను కొట్టిపారేయటం శుభపరిణామంగా చెప్పాలి. ఇక.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకమైన సదరు ఇస్మాయిల్ అనే పీటీ మాష్టారిని స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి.. అతి చేసిన చానల్ కనీసం తప్పు జరిగిందన్న మాట కూడా చెప్పకపోవటం దేనికి నిదర్శనం?
Tags:    

Similar News