ఇంత అభిమానం తెలుగోళ్ల‌కే సాధ్యం బాసూ!

Update: 2019-06-15 06:11 GMT
ప్రేమ‌కు హ‌ద్దులు.. స‌రిహ‌ద్దులు ఉండ‌వ‌ని అంటారు. ఈ విష‌యంలో మిగిలిన వారి సంగ‌తేమో కానీ.. తెలుగు  ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌ల తీరు భ‌లే సిత్రంగా ఉంటుంది. రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కేసీఆర్ కు ఫ్లెక్సీలు క‌ట్టి.. పాలాభిషేకాలు చేయ‌టం ఆంధ్రోళ్లు చేస్తుంటారు.త‌ర‌చూ ఆయ‌న బ‌ర్త్ డేలు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల్ని ఘ‌నంగా నిర్వ‌హించే క‌ల్చ‌ర్ ఏపీలో క‌నిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్ మీద త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు. ఆయ‌నతోకూడిన ఫ్లెక్సీలు.. హోర్డింగ్ లు ఇప్పుడు హైద‌రాబాద్ తో స‌హా ప‌లు ప్రాంతాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక‌.. జ‌గ‌న్ జ‌పం తెలంగాణ విప‌క్షాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ఇలా సొంతోళ్ల‌నే కాదు.. బ‌య‌టోళ్ల‌ను అభిమానించే తెలుగోళ్లు.. మ‌న‌కే మాత్రం సంబంధం లేని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిమానించ‌టం.. ఆయ‌న్ను ఆరాధించ‌టం క‌నిపిస్తుంది. దేవ‌తా విగ్ర‌హాల‌కు ఎలాంటి పూజ‌లు చేస్తారో.. అదే తీరులో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కు పూజ‌లు చేసే వీరాభిమాని ఉదంతం ఇది.  జ‌న‌గామ జిల్లాలోని బ‌చ్చ‌న్న‌పేట మండ‌లంలో కొన్నె అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్య‌క్తి ట్రంప్ బ‌ర్త్ డేను భారీగా నిర్వ‌హించారు. శుక్ర‌వారం ఆయ‌న పుట్టిన‌రోజుకావ‌టంతో ఇంటి ద‌గ్గ‌ర ట్రంప్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి.. త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. పుట్టిన‌రోజు వేడుక‌ల్లో భాగంగా గ్రామ‌స్తుల‌కు అన్న‌దానం ఏర్పాటు చేశాడు. కృష్ణ మాత్ర‌మే కాదు.. ఆయ‌న ఫ్యామిలీ మొత్తం ట్రంప్ ను దేవుడిగా ఆరాధిస్తుంటారు. వీరి తీరు స్థానికంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింద‌ని చెప్పాలి.   ట్రంప్ నేతృత్వం వ‌హించే రిప‌బ్లిక‌న్ పార్టీలోనూ ఈ స్థాయిలో అభిమానించి.. ఆరాధించే వారు ఉండ‌రేమో? ఈ వీరాభిమాని గురించి ట్రంప్ కు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News