తెలుగోడి దెబ్బ‌!..క‌న్న‌డ‌నాట బీజేపీకి కష్ట‌మే!

Update: 2018-04-19 08:06 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో క‌ఠిన వైఖ‌రితో ముందుకు సాగుతున్న ఎన్డీఏ ర‌థ‌సార‌థి బీజేపీకి తొలి ఎదురు దెబ్బ రెడీ అయిపోయినట్లుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా పార్ల‌మెంటులో జ‌రిగిన చర్చ సంద‌ర్భంగా రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోతున్న న‌వ్యాంధ్ర‌కు ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నున్న‌ట్లు నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌టించ‌గా... ఐదేళ్లు కాదు ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల్సిందేన‌ని నాడు బీజేపీ ఎంపీ హోదాలో ఇప్ప‌టి ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలోకి రావ‌డం - కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ విప‌క్షంలో కూర్చోవ‌డం జ‌రిగిపోయింది. ఈ క్ర‌మంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేసిన‌ట్టేన‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీకి తీర‌ని అన్యాయం చేసేసింది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి వీలు కావ‌డం లేద‌ని, దాని స్థానంలో దాని కంటే మెరుగైన ల‌బ్ధి చేకూరే ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పిన మోదీ స‌ర్కారు... చివ‌ర‌కు ప్యాకేజీ నిబంధ‌న‌లు రూపొందించ‌డంలోనూ ఆసక్తి క‌నబ‌ర‌చ‌లేదు. దీంతో ఏపీకి నాలుగేళ్ల పాటు జ‌రిగిపోయింది. రాష్ట్రానికి నిధుల విడుద‌ల‌లో తీర‌ని జాప్యం జ‌రిగింది. జాప్యం అనే కంటే కూడా రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు బీజేపీ స‌ర్కారు సిద్ధ‌ప‌డ‌లేద‌న్న మాట తేలిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌జ‌లు మోదీ స‌ర్కారుపై చాలా ఆగ్ర‌హంగా ఉన్నార‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా బాగానే ఉన్నా... త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. క‌న్న‌డ నాట విజ‌య తీరాల‌కు చేర‌డంతో దక్షిణాదిన కూడా  త‌మకు ప‌ట్టు ఉంద‌ని చెప్పుకోవ‌డానికి వీలుంటుంద‌న్న కోణంలో ముందుకు సాగుతున్న బీజేపీ అధిష్ఠానం ప్ర‌చార ప‌ర్వంలోకి హేమాహేమీల‌ను దింపేస్తోంది. ఇప్ప‌టికే  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - పార్టీ కీల‌క నేత‌లు ప‌లుమార్లు క‌న్న‌డ నాట ప్ర‌చారం సాగించారు. అయితే ఎంత చేసినా కూడా క‌న్న‌డ నాట బీజేపీ గెలుపు సాధించే అవ‌కాశాలు లేవ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇందుకు కార‌ణం క‌ర్ణాట‌క‌లో స్థిర‌ప‌డిన తెలుగు వారి ఓట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎంత కర్ణాట‌క‌లో స్థిర‌ప‌డ్దా... త‌మ సొంత గ‌డ్డ అయిన తెలుగు నేల‌కు చెందిన ఏపీకి అన్యాయం జ‌రిగితే... అక్క‌డి తెలుగువారికి కోపం రాకుండా ఉంటుందా? అందులోనూ బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న భావ‌న మరింత‌గా పెరిగిపోయిన వైనం కూడా క‌న్న‌డ తెలుగోళ్ల‌ను బాగానే ప్ర‌భావితం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

క‌ర్ణాట‌క‌లో పార్టీల విజ‌యావ‌కాశాల‌ను ప్ర‌భావితం చేసేంత స్థాయిలో తెలుగు ఓట్లు ఉన్నాయ‌న్న విష‌యం తెలిసిందే క‌దా. అదే ఓట‌ర్లు ఇప్పుడు బీజేపీకి చుక్క‌లు చూపించేందుకు రంగం సిద్ధం అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నోట నుంచి వ‌చ్చిన మాట‌లేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్న అమిత్ షా... ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ప్రత్యేకపరిస్థితులు కర్నాటక ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం లేదని చాలా ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో స్థిరపడిన తెలుగువాళ్లు చాలా తెలివైన వాళ్లని.. వాళ్లు ఏపీ పరిస్థితులను బట్టి కాకుండా.. కర్నాటకలోని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుని తమ పార్టీకి అండగా నిలుస్తారని.. తనదైన శైలిలో భాష్యాలు చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే క‌న్న‌డ నాట త‌మ‌కు త‌గిలే తొలుగోడి దెబ్బ అమిత్ షాకు ఇప్ప‌టికే అర్థ‌మైన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగు నేల‌కు చేసిన అన్యాయానికి ప్ర‌తిఫ‌లంగా క‌న్న‌డ నాట బీజేపీ ఓట‌మిని చ‌విచూడ‌నుంద‌న్న మాట‌.

Tags:    

Similar News