చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. కేంద్రాన్ని సాధించు మ‌న‌వాడా!

Update: 2022-02-17 11:30 GMT
చెయ్యెత్తి జై కొట్టాల్సిన స‌మ‌యం ప్ర‌తి తెలుగు వాడికీ ఆస‌న్న‌మైంది. ఇన్నాళ్లు నిద్రాణంగా ఉన్న తెలుగు జాతి.. ఒక స‌మున్నత ఆశ‌యం కోసం క‌ల‌సి క‌ట్టుగా ముందుకు క‌ద‌లాల్సిన స‌మ‌యం రానే వ‌చ్చింది. కేంద్రం దాష్టీకాల‌కు రెండు తెలుగు రాష్ట్రాలు ఏవిధంగా న‌లిగిపోతున్నాయో.. ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నాయో.. అంద‌రికీ క‌ర‌త‌లామ‌ల‌కం! ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి తెలుగు రాష్ట్రాలు కేంద్ర పాల‌కుల‌ ఉదాసీన వైఖ‌రితో ఈసూరోమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతూనే ఉంది. `ఎవ‌రో ఒక‌రు ఎపుడో అపుడు` అన్న‌ట్టుగా ద‌శాబ్దానికి ఒక‌రైనా ఈ వేద‌న‌ను, ఆవేద‌న‌ను జీర్ణించుకోలేక‌.. కేంద్ర పాల‌కుల‌పై క‌దం తొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు.

తెలుగు జాతి పౌరుషాన్ని, అంత‌కుమించిన ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వీధుల్లో తాక‌ట్టుపెట్ట‌లేక‌.. ఏం జ‌రిగితే.. అదే జ‌రుగుతుంద‌నే తెగువ‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో సాధించిన విజ‌యాలు ఉన్నా.. సాధించాల్సిన అనేక విషయాలు.. విజ‌యాలు మ‌రింత‌గా పోగుప‌డ్డాయి. ``ప‌న్నుల సొమ్ము రాబ‌ట్ట‌డం నుంచి ప్రాథ‌మిక అవ‌స‌రాల వ‌ర‌కు కేంద్రం ద‌యాదాక్షిణ్యాల‌పై ఎన్నాళ్లు ఆధార‌ప‌డ‌డం? మ‌న హ‌క్కులు మ‌నం కొట్లాడైనా సాధించుకోలేమా?!`` అన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు వ్యాఖ్య‌ల‌ను నిశ్చితాభిప్రాయంలో చూడ‌లేం. దీని వెనుక విశాల స‌మున్న‌త తెలుగు రాష్ట్రాల‌ స్వేచ్ఛాభిలాష ఉంద‌నేది వాస్త‌వం!

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ గ‌ద్దెపై తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని స‌మున్న‌తంగా నిల‌బెట్టాల‌ని.. తెలుగువాడి వాడి-వేడిని ఉత్త‌రాదికి సింహ గ‌ర్జ‌న‌ స్వ‌రంతో వినిపింప‌జేయాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు అంటే.. తెగువ‌లేనివారు.. తెలివిలేని వారు.. అని భావించే ఉత్త‌రాది పాల‌క ప‌క్షానికి గ‌ట్టి శాస్తి చేయాల‌ని ఆది నుంచి తెలుగు నేత‌లు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు ఢిల్లీపై విజ‌యం ద‌క్కించుకున్న‌వారు కూడా ఉన్నారు. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి హ‌స్తిమ‌శ‌కాంత‌ర తేడా ప్రాదుర్భ‌వించి.. పార్టీలు త‌మ సొంత‌ అజెండాల‌ను పుణికిపుచ్చుకుని పాకులాడుతున్న నేప‌థ్యంలో తెలుగు వాడు ఢిల్లీ వీధుల్లో దేబిరించాల్సిన దుస్థితి దాపురిస్తోంద‌న్న‌ది నిర్వివాదాంశం!!

ఈ దుస్థితిని తెగ‌టార్చేందుకు.. ఈ దైన్యాన్ని ప‌ఠాపంచ‌లు చేసేందుకు క‌దిలిన‌ అస్త్రంగానే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను భావించాల్సి ఉంటుంది. దీనిలో మ‌రో కోణం లేదు. మ‌రో వాద‌నా లేదు. పోరాడితే పోయేదేమీ లేదు అన్న‌ట్టుగా.. `నేను సైతం` అంటూ.. కేంద్రంపై క‌ద‌న భేరీ మోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్న మ‌న తెలుగు ముద్దుబిడ్డ‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఆశీర్వ‌దించాల్సిన.. చేతులు క‌లిపి.. ప్రోత్స‌హించాల్సిన అత్యవ‌ర‌స‌ర.. అత్యావ‌శ్య‌క స‌మ‌యం ఇదే అన‌డంలో మ‌రో మాట‌కు తావులేదు.

ఢిల్లీపై పోరులో తెలుగు బిడ్డ‌లు

తెలుగు వారి ఆత్మ‌గౌరవ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ పునాదులు.. భూమిక కూడా ఢిల్లీపై పోరుతోనే సంక‌ల్పం చెప్పుకొన్నాయి. నాడు విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు తెలుగు తేజం నంద‌మూరి తార‌క‌రామారావు.. ఉమ్మ‌డి రాష్ట్ర‌ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి టంగుటూరి అంజ‌య్య‌కు జ‌రిగిన అవ‌మానం హేతువుగా.. పార్టీని స్థాపించారు. ఢిల్లీ పెద్ద‌ల కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్ వ‌స్తే.. వారికిస‌రైన మ‌ర్యాద‌లు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంటూ.. అప్ప‌టిక‌ప్పుడు.. అంజ‌య్య‌ను సీఎం ప‌ద‌వి నుంచి తృణీక‌రించిన తీరే.. అన్న‌గారిలో రాజ‌కీయ అరంగేట్రానికి ఆలంబ‌న‌గా మారింది. `ఆత్మ‌గౌరవం` కోసం.. ఆయ‌న పార్టీ పెట్టి.. ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చారు. అనంత‌ర కాలంలో తెలుగు జాతి కోసం కేంద్రంలో అధికారం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌ట్టిగా వాదించారు. ఈ క్ర‌మంలోనే `నేష‌న‌ల్ ఫ్రంట్‌`కు శ్రీకారం చుట్టారు.

నేషనల్ ఫ్రంట్ (NF) అనేది జనతాదళ్ నేతృత్వంలోని రాజకీయ పార్టీల సంకీర్ణం. ఇది 1989 -1990 మధ్యకాలంలో ఎన్టీఆర్  నాయకత్వంలో ఏర్పాటైంది. అప్ప‌టికి ఆయ‌న పార్టీ పెట్టి కేవ‌లం ఐదు సంవ‌త్సరాలే అవుతుంది. అయినా.. జాతీయ‌స్థాయిలో నాయ‌కుల‌ను క‌ద‌లించారు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ ఫ్రెంట్‌కు అధ్య‌క్ష‌డిగా ఉండి.. వీపీ సింగ్ కన్వీనర్‌గా పార్టీని ముందుకు న‌డిపించారు.   రామారావు నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదింపి.. నేష‌న‌ల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సంకీర్ణ ప్రధానమంత్రిగా వీపీ సింగ్ తరువాత చంద్ర శేఖర్ అధికారంలోకి వచ్చారు. జాతీయ స్థాయిలో జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ, తమిళనాడు నుండి డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం), అస్సాంకు చెందిన అసోం గణ పరిషత్, ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్), అదేవిధంగా లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ఇచ్చింది.  

అనంత‌ర కాలంలో నేష‌న‌ల్ ఫ్రంట్ అనుకున్న ల‌క్ష్యాలు సాధించ‌లేక పోయింది. ఈ క్ర‌మంలోనే మ‌రో అవ‌కాశం తెలుగు వారికి దక్కింది. అదే.. తెలంగాణ ముద్దుబిడ్డ‌.. పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు. ఈయ‌న.. కాంగ్రెస్ అవ‌సాన ద‌శ‌లో ప్ర‌ధానిప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే అస్థిర మ‌ద్ద‌తుతోనే.. ఐదేళ్ల‌పాటు.. ఢిల్లీని పాలించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నంద్యాల నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసిన స‌మ‌యంలో తెలుగు వాడు ప్ర‌ధాని అవుతుంటే.. ఇంత‌క‌న్నా కావాల్సింది ఏముంటుంద‌ని పేర్కొంటూ.. అప్ప‌టిటీడీపీ అధినేత ఎన్టీఆర్ పోటీ కూడా పెట్ట‌కుండా.. ఏక‌గ్రీవంగా గెలిపించారు. అయితే.. కేంద్రం అప్ప‌టి ప‌రిస్తితుల నేప‌థ్యంలో ఆయ‌న కూడా ఉమ్మ‌డి రాష్ట్రానికి అనుకున్న విధంగా మేళ్లు చేయ‌లేక పోయార‌నేది వాస్త‌వం.

త‌ర్వాత టీడీపీ పగ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు కూడా కేంద్రంలో చ‌క్రం తిప్పిన మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే 1996లో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కూట‌మి ఏర్ప‌డింది. దీనికి క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. మొత్తం 13 పార్టీలు క‌లిసి ఈ కూట‌మిని ఏర్పాటు చేశాయి. ఈ క్ర‌మంలోనే కూట‌మి తొలి ప్ర‌ధానిగా చంద్ర‌బాబుకు అవ‌కాశం వ‌చ్చింది. అయితే.. ఆయ‌న ఏపీనే ముఖ్య‌మని భావించి.. ఈ ప్రతిపాద‌న‌ను తిర‌స్క‌రించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌కు చెందిన జ‌న‌తాద‌ళ్ నేత దేవెగౌడ‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇలా.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు నేల నుంచి ఎన్టీఆర్‌, పీవీ, చంద్ర‌బాబులు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు.

అయితే.. ఇప్పుడు.. మ‌రో గ‌ళం ఢిల్లీ వైపు వినిపిస్తోంది. ఆసేతు హిమాచలం వినిపించేలా.. తెలుగు గ‌ర్జ‌న వినిపించేందుకు సిద్ధ‌మైంది. అప్ప‌టికి ఇప్ప‌టికి.. అనేక ప్రాధాన్యాలు.. మారిపోయాయి. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది.. అత్యంత అవ‌స‌ర‌మైన‌.. యుద్ధం. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు క‌దిలారు. అన్ని పార్టీల‌నూ క‌దిలిస్తున్నారు. అయితే.. ఆయ‌న‌కు పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. స్టాలిన్‌(త‌మిళ‌నాడు), మ‌మ‌తా బెన‌ర్జీ(బెంగాల్‌), జార్ఖండ్‌(హేమంత్ సొరేన్‌), బిహార్ విప‌క్షం(ఆర్జేడీ) కూడా క‌లిసి వ‌స్తోంది. దీంతో తెలుగు య‌వ‌నిక‌.. ఢిల్లీ వీధుల వ‌ర‌కు త‌న గ‌ర్జ‌న‌ను సారించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

అయితే.. ఇప్పుడు తేలాల్సింది.. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా ఏపీలోని అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కేంద్రంలో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పేందుకు జ‌గ‌న్ పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌డం లేదు. ఇక‌, చంద్ర‌బాబు అధికారంలో లేక పోవ‌డంతోపాటు.. ఇత‌ర‌త్రా కార‌ణాలు కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో ఇప్పుడు కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చేందుకు ప్ర‌జ‌లే న‌డుం బిగించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వాస్త‌వం. మ‌రి క‌దులుదామా.. క‌డ‌లి కెర‌టాలై.. కేసీఆర్‌కు ద‌న్నుగా.. వెన్నుగా!!
Tags:    

Similar News