ఉక్రెయిన్లో భయభయంగా.. తెలుగు విద్యార్థులు..

Update: 2022-02-25 04:48 GMT
రష్యా దూకుడుతో ఉక్రెయిన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా బాంబుల వర్షం కురిపించడంతో ఇక్కడి సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో  నిత్యావసర సరుకులు అందక అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్లో చదువుకునేందుకు వచ్చిన ఇతర దేశాల విద్యార్థులు  భయభయంగా గడుపుతున్నారు. అయితే వీరిలో ఇండియా నుంచి చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అయితే ఉక్రెయిన్ ఏయిర్ స్పేస్ పైన నిషేధం విధించడంతో అక్కడ చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు రాయబార కార్యాలయాల అధికారులు కీలక సూచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో చిక్కకున్న వారి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1500 మంది ఉక్రెయిన్ విమానాశ్రయంలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు.

కొన్నేళ్లుగా ఉభయ రాష్ట్రాల నుంచి ఉక్రెయిన్ కు ఏటా వందలాది మంది మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్తున్నారు. అయితే ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులను వెనక్కి వెళ్లాలని సూచించారు. కానీ వారు అక్కడి నుంచి వెనక్కి రావడానికి నిరాసక్త చూపిస్తున్నారు. అందుకు విమాన ఛార్జీలు భారీగా ఉండడమే కారణమని అంటున్నారు.ఇక కొందరు తిరిగి వచ్చేందుకు రెడీ అయినా మార్చి వరకు గానీ టిక్కెట్లు దొరకలేదు.

అయితే ఇప్పుడున్న పరిస్థితులు భయానకంగా మారాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న బాంబుల వర్షంతో ఇక్కడి ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం దొరకడం లేదు. అయితే స్థానికంగా అండగా నిలవాల్సిన అధికారులు తమను నిండా ముంచేశారని ఆవేదన చెందుతున్ారు. యుద్ధం వస్తుందన్నవిషయం అవాస్తవమని చెబుతూ తప్పుడు సమాచారం చేశారన్నారు. అందువల్లే తమ దేశాలు వెనక్కి రమ్మని పిలిచినా కొందరు  తిరుగుముఖం పట్టలేదు. కానీ ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కనీస సరుకులు కూడా నిల్వచేసుకోకుండానే యుద్ధం సాగుతుండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెబుతున్న ప్రకారం.. సైరెన్ వచ్చినప్పుడు బంకర్లలో తలదాచుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వాపోతున్నారు. ఉక్రెయిన్లోని ఖార్ కీవ్ నగరంలో కొన్ని చోట్ల బాంబ్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. నగరానికి దూరంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. భారతీయ విద్యార్థులు అక్కడి అధికారుల సూచనల మేరక పాస్ పోర్టు, గుర్తింపు కార్డులు తదితర పత్రాలన్నీ పట్టుకొని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు.

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఇద్దరు అధికారులను నియమించారు. తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రికి తాజాగా లేఖ రాశారు. తెలుగు విద్యార్థులను తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేస్తోంది. ఎలాగైనా భారతీయ పౌరులను తిరిగి దేశానికి సేఫ్ గా రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News