ఒక కరోనా పది తలలు.. ఆ దేశంలో మరో కొత్త స్ట్రెయిన్!

Update: 2021-01-17 15:30 GMT
ఏడాది క్రితం ఒక్క రూపంతోనే మొదలైన కరోనా.. క్రమక్రమంగా తన ఉనికి మార్చుకుంటూ.. ఇప్పుడు పది రకాలుగా రూపాంతరం చెందింది! రాబోయే రోజుల్లో ఇది మరెన్ని తలలు మొలుస్తుందో తెలియట్లేదు! స్ట్రెయిన్ అంటూ వచ్చిన కొత్త రూపంతో ప్రపంచ దేశాలను రెండోసారి భయాందోళనకు గురిచేస్తున్న కొవిడ్ వైరస్.. తాజాగా బ్రెజిల్ లో మరో కొత్త రూపం సంతరించుకుంది. ప్రస్తుతం కనుగొన్న వ్యాక్సిన్లు కూడా దీనిపై పనిచేయడం అనుమానమే అంటున్నారు శాస్త్రవేత్తలు!

పది రకాలుగా..

బ్రిటన్‌ లో స్ట్రెయిన్ గా మారి శరవేగంగా వ్యాపించే గుణంతో ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే.. ఇప్పుడు బ్రెజిల్‌లోనూ రూపు మార్చుకుందట ఈ వైరస్. గత నెలలోనే అక్కడి శాస్త్రవేత్తలు ఓ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఇప్పటికే అది 10 రకాలుగా రూపాంతరం చెందిందని తేల్చారు. అంతేకాదు.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు ఈ కొత్తరకం వైరస్ లొంగుతుందన్న నమ్మకం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మన శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలు మళ్లీ మొదలు పెట్టారు.

మరింతగా మార్పు..

బ్రెజిల్ లో బయటపడిన కరోనా స్ట్రెయిన్ వైరస్ లో జన్యు మార్పులు చాలా ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. సౌతాఫ్రికా, బ్రిటన్‌లలో బయటపడిన స్ట్రెయిన్‌లతో పోల్చితే.. బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లో మరింత బలంగా ఉందని చెబుతున్నారు. కాగా.. ఇప్పటివరకు ఈ స్ట్రెయిన్‌ కేసులు భారత్‌లో ఒక్కటి కూడా నమోదుకాలేదని, జపాన్‌లో మాత్రమే బ్రెజిల్‌ స్ట్రెయిన్‌ కేసులు వెలుగు చూశాయని తెలిపారు. గతంలో కొవిడ్‌ బారిన పడ్డ వాళ్లకు కూడా ఇది సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లలో గుర్తించిన కరోనా కొత్త రకాల ప్రభావాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీస్‌ చీఫ్‌ డాక్టర్‌ మైకేల్‌ రియాన్‌ తెలిపారు. అయితే.. ఈ వైరస్ వ్యాప్తికి మనుషుల ప్రవర్తన కూడా ఒక కారణమని చెప్పారు. భౌతిక దూరం పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Tags:    

Similar News