'కారు' బొర్లా పడుతాది... జాగ్రత్తగా నడపండి...!

Update: 2021-11-28 07:30 GMT
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను గులాబీ పార్టీ మొత్తం గంపగుత్తగా ఏకగ్రీవం చేసుకోవాలని అనుకుంది. అయితే టీఆర్‌ఎస్ రెబల్స్, స్వంతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగడం అధకార పార్టీకి మింగుడుపడలేదు. వీరిపై అనేక ఒత్తడిలు చేశారు. బెదిరించారు.. బ్రతిమలాడారు.. ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేశారు. కొందరిని నామినేషన్లు ఉపసంహరించుకునేలా  చేశారు. మరి కొన్ని స్థానాల్లో ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థులు బరిలోనే దిగుతామని తేల్చిచెప్పడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. స్వంత పార్టీ నేతలే రెబల్ గా పోటీలో నిలబడడంతో టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. దీంతో ఓటర్లు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెర తీశారు.

మొత్తం 12 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 12 స్థానాల్లో ఆరు స్థానాలను అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. నిజామాబాద్ నుంచి కవిత, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాల నుంచి శంభిపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి  వరంగల్ నుంచి పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెబల్స్ బరిలో ఉన్నారు. అభ్యర్థులు నామినేషన్ ను ఉపసంహరించుకోకపోవడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. స్వంతంత్ర పార్టీలకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పోటీ అనివార్యమైంది. ఈ జిల్లాల్లో నామినేషన్లు వేసిన వారిలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్ రెబల్స్ గా బరిలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఖమ్మం, మెదక్ లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ.. ఇతర ప్రాంతాల్లో హస్తం పార్టీ స్వతంత్రులకు మద్దతు ఇస్తోంది. కొన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ రెబల్స్ కు బీజేపీ అండగా నిలుస్తోంది. గెలుపు సులభంగా ఉంటుందని భావించిన అధికార పార్టీకి ఇప్పుడు తలనొప్పి మొదలైంది.

ఆదిలాబాద్ లో టీఆర్‌ఎస్ కు చెందిన సారంగాపూర్ జెడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, కడియం జెడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్ రెడ్డి, పెందూరు పుష్పరాణి స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేశారు. వీరు పోటీ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో టీఆర్‌ఎస్‌ అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.  కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు వేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకోక ముందే పార్టీకి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన సైదాపూర్‌ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్‌ రెడ్డితో పాటు మరికొందరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు ఖమ్మం నుంచి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాతా మధుసూదన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి పోటీలో ఉన్నారు. వీరిలో నామినేషన్ కు టీఆర్ఎస్ లోని ఎంపీటీసీ సభ్యులే ప్రతిపాధించడం విశేషం. స్వంత పార్టీ నేతలే మద్దతు ఇవ్వడంతో గులాబీ పార్టీకి మింగుడుపడడం లేదు. ఇక నల్గొండ జిల్లాలో ముగ్గురు టీఆర్ఎస్ నేతలు స్వంతంత్రులుగా నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ లో టీఆర్‌ఎస్ కు చెందిన ఎంపీటీసీ బరిలో ఉన్నారు.

స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని, ఎమ్మెల్యేలు తమను లెక్కచేయడం లేదని పలువురు ఎంపీటీసీలు రగిలిపోతున్నారు. అధికార పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల మధ్య విభేదాలున్నాయి. అభ్యర్థులు చేజాకుండా క్యాంపుకు తరలిస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, మైసూరులాంటి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. అందరిని ఒకే చోటికి గాకుండా వేరువేరు గ్రూపులుగా విడదీసి క్యాంపులను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. క్యాంపు నుంచి ఎవరిని బయటికి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెట్టారని చెబుతున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఓటు వేస్తారనే ఆంశంపై టీఆర్‌ఎస్ లో ఉత్కంఠ నెలకొంది. అవగాహన కలిగిన ఎమ్మెల్యేలు కూడా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసే క్రమంలో తిరస్కరణకు గురైన ఘటనలను గులాబీ పార్టీ గుర్తుచేసుకుంటోంది. గతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో గందరగోళ పడితే పార్టీకే నష్టం కలుగుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News