జగ్గంపేటలో ఉద్రిక్తత ... రెండు గ్రూపుల మధ్య ఘర్షణ - కత్తులతో దాడులు !

Update: 2021-02-09 14:05 GMT
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా  తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

 పంచాయతీ ఎన్నికల గొడవలతో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కత్తులతో దాడులకు దిగడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ, వైసీపీ  మద్దతుదారులు ఈ ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు జగ్గంపేటకు చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ..  ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన పోలింగ్.. కాసేపటి క్రితమే పూర్తయింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాలకే పోలింగ్ ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది. 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14వేల 535 సూపర్‌వైజర్లు, 37వేల 750 మంది సిబ్బంది పని చేయనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 29వేల 732 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 12 జిల్లాల్లోని 3వేల 249 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 32వేల 502 వార్డుకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 7వేల 506 మంది అభ్యర్థులు పోటీ పడగా.. వార్డు సభ్యుల స్థానాలకు 43వేల 601 మంది బరిలో ఉన్నారు.
Tags:    

Similar News