వెయ్యి కోట్లు సంపాదిస్తున్నారు.. బయటికి రారా?

Update: 2018-05-13 10:10 GMT
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు తెలుగు సినీ పరిశ్రమ కదలి రాకపోవడాన్ని తప్పుబట్టారు నిర్మాత రవిచంద్. ఆయన ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినిమా పరిశ్రమ కలిసి రావాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పున్నమి ఘాట్‌లో జలదీక్ష చేపట్టారు. ఏడాదికి వెయ్యి కోట్ల దాకా సినీ పరిశ్రమ ఆర్జిస్తోందని.. జనాల నుంచే ఈ ఆదాయం పొందుతున్న సినిమా వాళ్లు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదని ప్రశ్నించారు. తమిళ హీరోల్ని చూసైనా మన వాళ్లు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. నాగార్జున.. వెంకటేష్.. ప్రభాస్ తదితర హీరోల పేర్లు రాసి వాళ్లు ఉద్యమంలోకి రావాలంటూ ప్లకార్డులు ప్రకటించారు. 'హీరోలూ ప్రత్యేక హోదా కోసం కదలిరండి'.. ‘ఆంధ్రా డబ్బులతో మీరు బతకడం లేదా' అన్న ప్లకార్డులు కూడా కనిపించాయి.

తమిళ హీరోలు జల్లికట్టు.. కావేరీ జల వివాదం లాంటి సమస్యలపై గళమెత్తారని.. కానీ మన హీరోలు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరని రవిచంద్ విమర్శించారు. తెలుగు ప్రజల హోదా ఆవేదన కేంద్రానికి అర్థం కావాలంటే ఎన్టీఆర్.. ప్రభాస్.. చరణ్ లాంటి పెద్ద హీరోలతో పాటు దగ్గుబాటి రాజమౌళి.. శ్రీను వైట్ల.. పూరీ జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకులు.. ఇంకా నిర్మాతలు ప్రజలకు మద్దతుగా బయటికి రావాలన్నారు. సినీ పరిశ్రమ అంతా విజయవాడకే వచ్చి పోరాడాల్సిన అవసరం లేదని..  హైదరాబాదులోనే ఫిలిం ఛాంబర్లో ఒక రోజు చూసుకుని అందరూ కలిసి ఆందోళన చేస్తే బాగుంటుందని అన్నారు. సినిమా వాళ్లు ప్రజల నుంచి టిక్కెట్ల ద్వారా ఏడాదికి వెయ్యి కోట్లు తీసుకుంటున్నారని.. సినీ పరిశ్రమ కోసం ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తోందని.. ఇవన్నీ తీసుకుంటున్న వాళ్లు జనం కోసం ఉద్యమాలు ఎందుకు చేయరని ప్రశ్నించారు. సినిమా వాళ్లు ఉద్యమిస్తే జాతీయస్థాయిలో దీనికి ప్రచారం వస్తుందని.. కేంద్రం కూడా స్పందిస్తుందని రవిచంద్ చెప్పారు.
Tags:    

Similar News