ఎవరికి వారు తమదే టికెట్ అంటున్నారు!

Update: 2019-03-18 04:29 GMT
కర్నూలు టీడీపీలో రసవత్తర రాజకీయం కొనసాగుతూ ఉంది. ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు ఇంకా అభ్యర్థులను తేల్చని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ నుంచి టికెట్ పోరు ఎలా ఉందో..ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఈ పోరు ఎప్పుడో వీధికి ఎక్కింది.

ఒకవైపు నుంచి టీజీ కుటుంబం - మరోవైపు  ఎస్వీ మోహన్ రెడ్డి..టికెట్ కోసం పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. వీరిలో ఎవరికి టికెట్ కేటాయించాలనేది చంద్రబాబు నాయుడు తేల్చలేకపోతూ ఉన్నారు. ఎవరికి టికెట్ ఇస్తే పరిస్థితి ఏమిటనే అంశం మీద బాబు తర్జనభర్జన కొనసాగుతూ ఉన్నట్టుంది. అందుకే ఈ వ్యవహారాన్ని పెండింగ్ లో పెట్టారు.

అయితే విశేషం ఏమిటంటే..ఈ ఇరు వర్గాలూ టికెట్ విషయంలో ఒకే రేంజ్ విశ్వాసంతో ఉన్నారు. ఒకవైపు టీజీ భరత్ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టేశాడు. వీధి వీధీ తిరుగుతూ అతడు ఓటు అడుగుతూ ఉన్నాడు. అయితే అసెంబ్లీ టికెట్  ఆయనకే అని చంద్రబాబు నాయుడు ఖరారు చేయలేదు.

మరోవైపు ఎస్వీ మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి.. టికెట్ తనకే అని ప్రచారం చేసుకొంటూ ఉన్నారు. టికెట్ తనకే ఖరారు అయ్యిందని ఆయన  అంటున్నారు. ఇటు టీజీ వర్గం టికెట్ తమకే అని ప్రకటించుకుంటోంది - అటు ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ తనకు దక్కిందని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. ఇద్దరూ ప్రచారం  చేసుకొంటూ ఉండటంతో.. ఎవరు అసలు - ఎవరు నకిలీ అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఏ ఒక్కరికి టికెట్ దక్కినా మరొకరు తెలుగుదేశం పార్టీలో ఉండరనేది మాత్రం సుస్పష్టం అవుతున్న అంశం.

నామినేషన్ల దాఖలు మొదలైన నేఫథ్యంలో ఎవరు టీడీపీలో ఉంటారు - ఎవరు వీడతారు.. అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో మైనారిటీ అభ్యర్థిని ఖరారు చేసుకుని జగన్ పార్టీ ప్రచారం మొదలుపెట్టేసింది!
Tags:    

Similar News