టీజీ వెంక‌టేష్‌ కు​ పోటీ తెస్తోన్న చంద్ర‌బాబు

Update: 2016-03-17 04:09 GMT
రాయలసీమ ముఖద్వారమైన క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. జిల్లా నుంచి ఇటీవ‌లే వైకాపాకు చెందిన భూమా నాగిరెడ్డి - భూమా అఖిల‌ప్రియ - జ‌య‌రాం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టీడీపీ ఎంట్రీ జిల్లాలో ఇప్ప‌టికే చాలా మంది టీడీపీ నాయ‌కుల్లో అసంతృప్తికి కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌రో వైకాపా ఎమ్మెల్యే టీడీపీ ఎంట్రీ ఇస్తార‌న్న వార్త సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి టీజీ వెంక‌టేష్‌ కు సెగ‌లు పుట్టిస్తోంద‌ట‌.

భూమా నాగిరెడ్డి బావ‌మ‌రిది - మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు క‌ర్నూలు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్‌ రెడ్డి కూడా గ‌తంలోనే టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఎందుకో గాని త‌న ప్ర‌య‌త్నాన్ని వాయిదా వేసుకున్నారు. బావ ఎలాగూ టీడీపీలో చేరిపోయాడు. ఇక ఆయ‌న టీడీపీ ఎంట్రీ కూడా రేపో మాపో ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ వార్త క‌ర్నూలు టీడీపీ ఇన్‌ చార్జ్‌ గా ఉన్న మాజీ మంత్రి టీజీ.వెంక‌టేష్‌ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌.

 రీసెంట్‌ గా ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు వేదికపై ఈ ఇద్దరు నేతలు పంచ్‌ డైలాగులు విసురుతూ, ఒక‌రిపై మ‌రొక‌రు సెటైర్లు వేసుకున్నారు. గతంలో వీరిద్దరు కర్నూలు అభివృద్ధి విషయంపై విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొన్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు రాజ‌కీయంగా ప‌ట్టు సాధించేందుకు ఎత్తులు - పైఎత్తులు వేస్తుండేవారు. కొద్ది రోజులుగా ఈ వేడి చ‌ల్లారినా ఎస్వీ.మోహ‌న్‌ రెడ్డి టీడీపీ ఎంట్రీ ఇస్తార‌న్న వార్త‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం మ‌ళ్లీ హీటెక్కింది.

 చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఎస్వీ కర్నూలును స్మార్ట్ సిటీగా చేయాల‌ని, నగరవాసుల దాహాన్ని తీర్చేందుకు మరో సమ్మర్ స్టోరేజ్‌ ని నిర్మించాలని.. ఇలా చాలా ప్ర‌తిపాద‌న‌ల‌ను చంద్ర‌బాబు ముందు ఉంచారు. చాలా రోజులుగా ఈ ప‌నులు పెండింగ్‌ లో ఉన్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా టీజీకి పంచ్ వేశారు. ఆయ‌న‌ ప్రతిపాదనలపై చంద్రబాబు స్పంద‌న కోసం జ‌నాలు ఎదురు చూస్తుండ‌గానే టీజీ మాట్లాడుతూ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే క‌ర్నూలును అభివృద్ధి చేయాల‌ని చంద్ర‌బాబును అన్ని విధాలా అడుగుతూనే ఉన్నాను.. ఆయ‌న కూడా స్పందిస్తున్నారు. ఈ టైంలో అడిగిన వాటినే మ‌ళ్లీ అడిగితే ఉప‌యోగం ఏముంటుంద‌ని ఎస్వీకి త‌న‌దైన స్టైల్లో టీజీ చుర‌క‌లు వేశారు.

భూమా ఎలాగూ టీడీపీలో చేరిపోయాడు కాబ‌ట్టి..బావ‌మ‌రిది ఎస్వీ.మోహ‌న్‌ రెడ్డి కూడా టైం చూసుకుని మ‌లివిడ‌త టీడీపీలో చేరే బ్యాచ్‌ తో క‌లిసి చేర‌తార‌ని..ఆయ‌న కూడా టీడీపీలో చేరేందుకు చంద్ర‌బాబు ఓకే చెప్పార‌న్న వార్త‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టీజీ వెంక‌టేష్ వ‌ర్గం ఎస్వీని చంద్ర‌బాబు టీడీపీలో చేర్చుకుంటే త‌మ‌కు రాజ‌కీయంగా దెబ్బేన‌ని భావిస్తోంది. ఈ విష‌యంలో టీజీ అడ్డుపెట్టినా ఆయ‌న మాట బాబు వినే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఇప్పుడు టీజీకీ చంద్ర‌బాబు మంట పుట్టిస్తున్నార‌న్న గుస‌గుస‌లు క‌ర్నూలులో వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News