లోకేష్ ఎవ‌రు... సీఎందే ఫైన‌ల్ - టీజీ

Update: 2018-07-11 10:20 GMT
క‌ర్నూలు లోక్ స‌భ‌ - శాస‌న‌స‌భ స్ధానాల‌కు తెలుగుదేశం అభ్య‌ర్ధులను పార్టీ నాయ‌కుడు - మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించ‌డంతో వివాదం రోజ‌రోజుకు ముదురుతోంది. ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించాలి కాని, మంత్రి లోకేష్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌డం ఏమిట‌ని పార్టీ నాయ‌కుడు - రాజ్య‌స‌భ స‌భ్యుడు టి.జీ.వెంక‌టేష్ మండిప‌డుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న‌పై పార్టీలో అన్ని వైపుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. క‌ర్నూలు సిటీ స్ధానం నుంచి టి.జీ వెంక‌టేష్ త‌న కుమారుడు భ‌ర‌త్‌ ను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆ త‌ర్వాత తెలుగుదేశంలో చేరిన నారాయ‌ణ‌రెడ్డి పేరును లోకేష్ ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అభ్య‌ర్ధులు ఎవ‌రో నిర్ణ‌యించేది ముఖ్య‌మంత్రేన‌ని టి.జీ వెంక‌టేష్ తేల్చి చెప్పారు.

ఒక‌వేళ మంత్రి లోకేష్ చెప్పిన‌ట్లుగానే నారాయ‌ణ రెడ్డికి తెలుగుదేశం టిక్క‌ట్ ఖ‌రారు చేస్తే టి.జీ. వెంక‌టేష్ వ‌ర్గీయులు పార్టీని వీడాల‌ని ఆయ‌న‌పై వొత్తిడి చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు టి.జీ వ‌ర్గీయులు స‌న్నాహాలు కూడా చేస్తున్న‌ట్లు వినికిడి. మంత్రి లోకేష్ ప్ర‌క‌టించిన ఇద్ద‌రు అభ్య‌ర్ధులు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాక‌పోవ‌డం, వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచిన వారు కావ‌డంతో జిల్లా తెలుగుదేశం నాయ‌కుల‌కు మంత్రి లోకేష్ ప్ర‌క‌ట‌న అభ్యంత‌ర‌క‌రంగా మారింది. పార్టీ జాతీయ అధ్య‌క్షుడ్ని, రాష్ట్ర అధ్య‌క్షుడ్ని తోసిరాజ‌ని లోకేష్ ఏ హోదాలో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నార‌ని జిల్లా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదే విధానం కొన‌సాగితే పార్టీకి జ‌రిగేది న‌ష్ట‌మే త‌ప్ప లాభం కాద‌ని వారంటున్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి ద్ర‌ష్టికి తీసుకువెళ్తామ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు టి.జీ.వెంక‌టేష్ అంటున్నారు. మ‌రోవైపు నారాయ‌ణ రెడ్డి కూడా అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌లో లోకేష్ కు పూర్తి హ‌క్కు ఉంద‌ని అన‌డం కొస‌మెరుపు. అయితే దీనిపై క‌ర్నూలు నేత ఎస్వీ మోహన్ రెడ్డి  స్పందించారు. పరిస్థితులను బట్టి లోకేష్ ఎంపీ - ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించారని అన్నారు. అలాగే టీజీ వెంకటేష్ - టీజీ భరత్‌ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.
Tags:    

Similar News