విభజన పాపం జగన్ అకౌంట్లో వేసేసిన టీజీ

Update: 2016-08-10 04:54 GMT
రాజకీయ ప్రత్యర్థులపైన తనదైన శైలిలో మండిపడుతూ.. పదవి చేతిలో ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడే చిత్రమైన మైండ్ సెట్ ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కు మాత్రమే సొంతం. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ మర్చిపోరు. అలాంటి పెద్దమనిషి విభజన సమయంలో ఎంత కామ్ గా ఉన్నారోప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విభజన తర్వాత పార్టీకి రాజీనామా చేసేసి సైకిల్ ఎక్కేసిన ఆయన.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయటం.. ఓటమిపాలు కావటం తెలిసిందే.

ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి చెందారో నాటి నుంచి మాట్లాడటం మానేసిన టీజీ వెంకటేశ్.. తన వ్యాపారాల మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు పుణ్యమా అని రాజ్యసభ సీటును దక్కించుకున్న టీజీ.. ఈ మధ్యన కాస్త మాట్లాడటం మొదలు పెట్టారు. అవసరానికి తగ్గట్లుగా మాట్లాడే తత్త్వం ఉన్న టీజీ.. తాజాగా ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన పాపం జగన్ దేనని చెప్పి ఆశ్చర్యపర్చిన ఆయన.. ఒక కొత్త కోణాన్ని వినిపించారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ దుర్మరణం అనంతరం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టాలని భావించిన జగన్ కారణంగానే విభజన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. అదెలా అన్న ప్రశ్న నోటి నుంచి రాక ముందే తానే వివరణ ఇచ్చేసిన టీజీ.. జగన్ సీఎం పదవి మీద కన్నేయటం.. అందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సిద్ధంగా లేకపోవటంతో.. ఆ పార్టీని దెబ్బ తీసేందుకు జగన్ ప్లాన్ చేశారని.. పార్టీని కాపాడుకునేందుకే సోనియా రాష్ట్ర విభజనకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.  హోదా అంశాన్ని పట్టుకొని జగన్ రాజకీయం చేయటం సరికాదన్న టీజీ.. ఇదే అంశంపై చంద్రబాబుపై విమర్శలు చేయటం విడ్డూరమని వ్యాఖ్యానించటం గమనార్హం. హోదాపై జగన్ తాజాగా చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. అందుకు కౌంటర్ గా జగన్ పైన టీజీ వెంకటేశ్ చేస్తున్న మాటల్ని.. విభజన సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ టీజీ వెంకటేశ్ ప్రజలకు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబితే సబబుగా ఉంటుందేమో. కానీ.. అలాంటిదేమీ లేకుండా జగన్ పై తీవ్రవ్యాఖ్యలు చేయటం సబబుగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News