సభకు మినిస్టర్ తమ్మినేనిగానే... ?

Update: 2021-11-19 17:30 GMT
శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారామ్. ఆయన  రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఎన్టీయార్ పిలుపు అందుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆముదాలవలసలో అప్పటికే  పాతుకుపోయిన బొడ్డేపల్లి రాజగోపాలనాయుడుని ఢీ కొట్టి 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన వరసబెట్టి నాలుగు పర్యాయాలు అంటే ఇరవై ఏళ్ల పాటు ఎమెంల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇక చాలా గ్యాప్ తరువాత 2019 ఎన్నికలలో తమ్మినేని సీతారామ్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రి పదవిని నాడే ఆశించినా జగన్ పెద్దాయన, సుదీర్ఘ అనుభవం అంటూ స్పీకర్ ని చేశారు.

స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నా కూడా తమ్మినేనికి మంత్రి కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇపుడు మంత్రి వర్గ విస్తరణలో ఆయన తనకు బెర్త్ కంఫర్మ్ అనుకుంటున్నారు. ఈ విషయంలో చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపు పాతికేళ్ళుగా కాళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వెలమలకే పెద్ద పీట వేస్తున్నారు. ఇక బీసీలకు జగన్ చాన్స్ ఇచ్చినా అది కొత్తగా గెలిచిన సీదరి అప్పలరాజుకే దక్కింది. దాంతో ఈ తడవ మాత్రం కచ్చితంగా కాళింగ సామాజిక వర్గ కోటాలో  తాను మంత్రిని కావడం ఖాయమని తమ్మినేని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆయన ఒక సందర్భాన్ని జగన్ని పొగడడానికి ఉపయోగించుకున్నారు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టింది ఎన్టీయార్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బిక్ష పెట్టింది మాత్రం కచ్చితం  జగనే అంటూ నిండు సభలోనే జగన్ని ఆకాశానికెత్తేశారు. దీని బట్టి చూస్తే జగన్ తన పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలని తమ్మినేని కోరుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. నిజానికి మంత్రి పదవి విషయంలో జగన్ మనసులో మాట ఎవరికీ చెప్పరు. మామూలుగా చేసే ట్రెడిషనల్ పాలిటిక్స్ ఆయనతో కష్టమనే చెబుతారు.

జగన్ తో ఎవరికైనా  అపాయింట్మెంట్ కూడా కష్టమే అన్న ప్రచారం కూడా ఉంది. ఇపుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో జగన్ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. దాంతో ప్రతీ వారు సభలో  తన చాతుర్యాన్ని ఉపయోగించి జగన్ మెప్పు పొందాలని, ఆయన దృష్టిలో పడాలని చూస్తున్నారు. చంద్రబాబుని ఘాటుగా విమర్శించిన అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి కోసమే గొంతు పెంచారని టాక్ కూడా ఉంది. ఇక కొడాలి నాని లాంటి వారు బాబుని ఎంత గట్టిగా టార్గెట్ చేస్తే తమ పదవీకాలం అంత ఎక్కువగా పెరుగుతుందని కూడా భావిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో స్పీకర్ సర్ కూడా ఒక వివరణ అంటూ సభలో  చెప్పుకొస్తూ తన మదిలో మాటను జగన్ చెవిన అలా వేశారనే అంటున్నారు. తనకు ఎన్టీయార్ జగనే రాజకీయ బిక్ష పెట్టారు అంటూ ఓపెన్ గా తమ్మినేని మాట్లాడారు అంటే ఆయన కచ్చితంగా మంత్రి పదవిని ఎంతలా ఆశిస్తున్నారో అర్ధమవుతోంది అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చూసుకుంటే ఈ మధ్యన ఒక మాజీ మంత్రి జగన్ సర్కార్ విధానాల  మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు, దాంతో ఆయనకు నో చాన్స్ అంటున్నారు. ఇక పెద్దాయనగా ఉంటూ ఇదే చివరి అవకాశమని భావిస్తున్న తమ్మినేనికి మంత్రి పదవి జగన్ ఇచ్చినా ఇస్తారని అంటున్నారు. తమ్మినేని మీద ప్రత్యేకమైన అభిమానం జగన్ కి ఉందని కూడా చెబుతున్నారు. సో ఈ సమావేశాలలో స్పీకర్ గా కనిపించిన తమ్మినేని వచ్చే సమావేశాల నాటికి మంత్రిగా వస్తారని కూడా చెబుతున్నారు.
Tags:    

Similar News