కాంగ్రెస్ ను షేక్ చేస్తున్న సినిమా ఇదీ..

Update: 2018-12-28 10:12 GMT
దేశానికి 10 ఏళ్లు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ పేరు ఎంత మారుమ్రోగి ఉండాలి. కానీ ఎక్కడా ఆయనకు పేరు రాలేదు. ఎందుకంటే ఆ సీట్లో ఆయన డమ్మీ అన్న విమర్శలు వచ్చాయి. ప్రధానిగా సోనియా కూర్చోలేక.. తన స్థానంలో మన్మోహన్ ను కూర్చుండబెట్టి చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. అందుకే అందరూ రబ్బర్ స్టాంప్ పీఎం అని ఆడిపోసుకున్నారు. ఎన్ని విమర్శలొచ్చినా ఆయన ఊలుకూ లేదు పలుకూ లేకుండా ఉన్నారు.

అయితే మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు తాజాగా రాసిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం సంచలనమైంది. ఇది మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ పరువు తీసింది. అయితే ఈరోజుల్లో పుస్తకాన్ని చదివే అలవాటు ఎవరికీ లేకపోవడంతో జనంలోకి వెళ్లలేకపోయింది.

కానీ ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా సినిమా వస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు.  ఇక సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పాత్రల్లో ఎవరో అనామకులు నటిస్తున్నారు. కనీసం గ్లామర్ లేకుండా వాళ్లు కనిపిస్తున్నారు. సినిమా నాణ్యత విషయంలో సరిగా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే కంటెంట్ బలంగా ఉండడం కాంగ్రెస్ కు గుబులు రేపుతోంది.

మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి దిగిపోయి 5 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కు దేశంలో ఊపు వచ్చిన వేళ వస్తున్న ఈ ట్రైలర్ కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేదే.. అందుకే ఈ సినిమా ను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కానీ ఇది కోట్ల మందికి చేరే విషయం కావడంతో ఎలాగైనా సరే సినిమా విడుదల చేసి రచ్చ చేయాలని బీజేపీ చూస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో సినిమా విడుదల ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలో డమ్మీ ప్రధాని మన్మోహన్ గురించి ఏం చూపారు.? సోనియా నడిపిన కథేంటి అన్నది ఆసక్తిగా మారింది. సినిమా విడుదలైతే దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News