ఏపీలో ఇప్ప‌డు ఆ షోకాజ్ నోటీస్ హాట్ టాపిక్‌

Update: 2019-11-04 06:35 GMT
ఆయనకు నియమాలు లేవు.. నిబంధనలు లేవు.. అంతా నా ఇష్టం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు తెలియక పాటించడం లేదని అనుకుంటే పొరపాటే మరి. అంతా పక్కా.. కావాలని ఉల్లంఘించడమే.. ఇంతకీ ఆయన ఎవరని అనుంటున్నారా ? ఆయన మరెవరో కాదు.. జీఏడీ పొలిటికల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌. అందుకే ఆయనకు ‘షోకాజ్‌ నోటీసు’ అందిందనే టాక్. ఆయ‌న త‌న ప‌రిధిని దాటి తీవ్రస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడినందునే సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. షోకాజ్‌ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉద్దేశపూర్వకంగానే, కావాలనే పైఅధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారని అందులో తెలిపారు. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ విషయం ఏపీలో రాజ‌కీయ‌, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కేబినెట్‌ ఎజెండా తయారీలో, మంత్రివర్గ సమావేశంలో చర్చకు రావాల్సిన అంశాలను పొందుపరచడంలో ప్రవీణ్‌ బిజినెస్‌ రూల్స్‌ పాటించలేదని, వీటికి సంబంధించి సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాలనూ ఖాతరు చేయలేదని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొనడం గమనార్హం. అసలు ఏం జరిగిందో చూద్దాం.. వైఎస్ఆర్ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఫైలును కేబినెట్‌ అజెండాలో పొందుపరిచేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రవీణ్‌ ప్రకాశ్ ఫైలు పంపారు. అయితే, ఆ ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని తిరిగి పంపాలని ఆదేశిస్తూ సీఎస్‌ వెనక్కి పంపారు.

అయితే అవేమీ పాటించకుండా ఆ ఫైలును ప్రవీణ్‌ ప్రకాశ్‌ నేరుగా కేబినెట్‌ ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. నిజానికి.. బిజినెస్‌ రూల్స్‌లోని రూల్‌ 7(2) ప్రకారం.. సెక్రటరీ ఒక ఫైలుపై సంబంధిత శాఖ నుంచి తప్పనిసరిగా ఆమోదం తీసుకోవాలి. అయితే.. సదరు ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. సీఎస్ స్పష్టంగా సూచించినా కూడా ఖాతరు చేయకుండా ఆ ఫైలును కేబినెట్‌ ముందు ప్రవేశ పెట్టారు. మంత్రివర్గ సమావేశంలో గ్రామ న్యాయాలయాల ఫైలు పెట్టాలని న్యాయశాఖకు ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ఆదేశాలు అందాయి. ఆ ఫైలుపై సీఎం సంతకం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన మెమోను జీఏడీలోని కేబినెట్‌ విభాగానికి అందజేశారు.

అయినప్పటికీ గత నెల 16వ తేదీ, 30వ తేదీ ల్లో జరిగిన కేబినెట్‌ సమావేశాల్లో గ్రామ న్యాయాలయాల ప్రతిపాదన ఫైలును ప్రవేశపెట్టడంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ విఫలం కావడం గమనార్హం. ఒకవేళ ఈ ఫైలును కేబినెట్‌లో పెట్టకూడదని సీఎం కార్యాలయం నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు మౌఖిక ఆదేశాలేమైనా అంది ఉంటే.. ఆ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకురావాలి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎస్ మెమో జారీ చేయడం గమనార్హం. వారంలో సంజాయిషీ ప్రవీణ్ ప్రకాశ్ ఎలా ఇస్తారో ? చూడాలి మరి.
Tags:    

Similar News