విశాఖ రాజధానికి ఆ ముప్పు....?

Update: 2023-01-28 09:42 GMT
విశాఖను ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా చేయాల్సిందే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం పట్టి ఉన్నారు. ఆయన సీఎం అయిన తొలి ఆరు నెలల నుంచే మూడు రాజధానుల పాట అందుకున్నారు. ఆయన మనసులో ఉద్దేశ్యం అయితే రెడీ మేడ్ సిటీ విశాఖను రాజధానిగా చేసుకోవడం. అదే టైం లో అమరావతి రాజధానిగా పట్టించుకోకపోవడం అని విపక్షాలు విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ పట్టించుకోకుండా ముందుకే అన్నట్లుగా సాగారు.

అయితే అమరావతిని అలా వదిలేయకుండా అసెంబ్లీ సమావేశాలకు వేదికగా చేసుకుంటామని శాసన రాజధాని అన్నారు. ఇక కర్నూల్ కి హై కోర్టు తరలింపు అన్నది ఒక డిమాండ్ కాబట్టి అలా చేయాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీని మీద ఒక చట్టం హడావుడిగా చేశారు. కానీ అది న్యాయ పరీక్షకు నిలబడదు అని ముందే రద్దు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే హై కోర్టు అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా చెబుతూ తీర్పు ఇచ్చింది. దాని మీద వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏమి తీర్పు వస్తుందో చూడాలి. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖ రాజధానికే మొగ్గు చూపుతోంది. అంతే కాదు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటోంది.

దీంతో విశాఖ రాజధానిగా ఎంతవరకూ సేఫ్ జోన్ అన్న దాని మీద రకరకాలైన కధనాలు వచ్చాయి. విశాఖ సిటీకి ఒక వైపు అంతా కొండలు ఉన్నాయి. తూర్పున సముద్రం ఉంది. ఒకవేళ అనుకోని ఉపద్రవాలు సాగరంలో ఏర్పడితే సిటీకి ఇబ్బంది అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా అప్పట్లో వార్తలు రాసింది. ఇంకో వైపు చూస్తే భూకంపాల జోన్ అని కూడా రాసారు.

వీటిని వైసీపీ నేతలు మంత్రులు తోసిపుచ్చారు. కానీ విశాఖ విషయంలో మరో ఇబ్బంది ఉందని అంటూ వస్తున్న వార్తలు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాల్సినవే. విశాఖ రక్షణ పరంగా వ్యూహాత్మకమైన సిటీగా ఉంది. 1971లో పాకిస్థాన్ తో యుద్ధం వస్తే నాడు విశాఖను పాకిస్థాన్ గురి పెట్టింది. ఘాజీ జలాంతర్గామి విశాఖ వైపు దూసుకువచ్చింది. ముందే ముప్పుని పసిగట్టడం వల్ల విశాఖ సేఫ్ అయింది.

ఇక విశాఖలో రక్షణపరమైన సంపత్తి ఉంది. తూర్పు నావికాదళం ఉంది.  విశాఖ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో చాలా కీలకమైన ప్రాంతంగా ఉంది. పొరుగున దాయాది పాక్ ఉంది.మరో వైపు చైనా కవ్వింపు చర్యలు ఉన్నాయి. దీంతో విశాఖ తీర ప్రాంతంలో గస్తీ ఎప్పటికపుడు పెంచుకుపోతున్నారు కానీ ఏ వైపు నుంచి ముప్పు పొంచి ఉందో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

విశాఖ ప్రస్తుతానికి అయితే మెగా సిటీగా ఉంది. రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం దాన్ని రాజధానిగా చేస్తే చాలా అతి ముఖ్యమైన నగరం అవుతుంది. వీవీఐపీలు అంతా విశాఖలోనే ఉంటారు. దాంతో టార్గెట్ సిటీగా ఇంకా మారుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తూర్పు నావికాదళం కను రెప్ప వేయకుండా తీర ప్రాంతాన్ని కాపాపడుతోంది. ఇపుడు రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపధ్యంలో నేవీ రక్షణ శాఖ అధికారులు సైతం ముఖ్యమంత్రిని కలుస్తూ విశాఖ రక్షణ గురించి వివరిస్తున్నారు.

ప్రభుత్వ సహాయన్ని మరింతగా వారు కోరుతున్నారు. తాజాగా విశాఖ తూర్పు నావికాదళం రక్షక దళ కమాండర్, అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివమణి పరమేష్‌ ముఖ్యమంత్రి జగన్ని కలసి తీర ప్రాంత భద్రత గురించి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయాన్ని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. విశాఖ రాజధాని కాబోతోందని కచ్చితమైన సమాచారం నేవీ అధికారుల వద్ద ఉండబట్టే ముఖ్యమంత్రిని కలిసి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖకు తీర ప్రాంత రక్షణ అతి పెద్ద సవాల్ అనే చెప్పాలని భద్రతా నిపుణులు సైతం అంటున్న పరిస్థితి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News