షాకింగ్ కోణం: హటాత్తుగా గుండె ఆగిపోతున్నది అందుకేనట

Update: 2023-02-28 06:00 GMT
ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ షేర్ అవుతున్నాయి. అప్పటివరకు నవ్వుతూ తుళ్లుతూ ఉండేవారు.. డ్యాన్సులు వేస్తుండేవారు.. ఆట ఆడుతుండేవారు.. జిమ్ చేస్తుండేవారు.. అప్పటివరకు ప్రసంగిస్తున్న వారు.. ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నమై.. ఉన్నట్లుండి కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలకు సంబంధించిన బోలెడన్ని ఉదంతాలు ఇటీవల కాలంలో తెర మీదకు వస్తున్నాయి. ఈ ఆకస్మిక గుండెపోట్లకు గురయ్యే వారిలో వయసుతో సంబంధం లేకుండా ఉండటం ఒక ఎత్తు అయితే.. అప్పటివరకు పెద్దఆరోగ్య సమస్యలు లేనోళ్లు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైనం ఇప్పుడుఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా సడన్ డెత్ లు కరోనా తర్వాత చోటు చేసుకుంటున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి వేళ.. అసలేం జరుగుతోంది? ఈ అకస్మిక మరణాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? శరీరంలో అసలేం జరుగుతోంది? ఏ కారణాలు హటాత్తు గుండెపోట్లకు కారణమవుతుంది? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ సడన్ డెత్ లు గతంలోనూఉండేవి కానీ అంతగా ఫోకస్ అయ్యేవి కావు. కరోనా తర్వాత ఈ తరహా కేసులు ఎక్కువైన విషయాన్ని హైదరాబాద్ కు చెందిన వైద్యులు చెబుతున్నారు. ఒక లెక్క ప్రకారం పాతిక బెడ్లు ఉన్నఆసుపత్రిలో ఈ తరహా కేసులు గతంలో రోజుకు ఒకట్రెండు వస్తే.. ఇప్పుడు నాలుగైదు వరకు వస్తున్నట్లు చెబుతున్నారు.

మరికొందరు ఆసుపత్రి వరకు కూడా రాకుండానే మరణిస్తున్నారని చెబుతున్నారు. దీని వెనుకున్న కారణాల్ని విశ్లేషిస్తే.. గతానికి భిన్నంగా ఆకస్మిక బ్లడ్ క్లాట్లు ఎక్కువైన విషయాన్ని హైదరాబాద్ వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లు.. ఎమోషనల్ స్ట్రెస్ పెరిగిపోవటం కూడా ఇలాంటి వాటికి కారణమవుతున్నట్లుగా చెప్పారు. అయితే.. ఈ క్లాట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధం లేదని చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సమస్య లేని వారిలోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడే వీలుందని చెబుతున్నారు.

శరీరంలో చోటుచేసుకునే రసాయనిక మార్పులు.. ఒత్తిడి పెరిగిపోవటం క్లాట్లకు కారణమవుతుందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మారిన జీవనశైలి కూడా ఈ తరహా మరణాలకు కారణమని చెబుతున్నారు. పడుకునే వేళలో పని చేయటం.. పని చేసే సమయంలో పడుకోవటం లాంటి వాటితో లైఫ్ సైకిల్ కు వ్యతిరేకంగా వ్యవహరించటంతో గుండెజబ్బుల ముప్పు పెరిగినట్లుగా చెబుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యల్ని టీఎంటీ, 2డీ ఎకో, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ పరీక్షలతో యాబై శాతం మేర గుండె సమస్యల్ని ముందే గుర్తించవచ్చంటున్నారు.

సిగిరెట్.. మద్యం తాగే అలవాటు ఉన్న వారు.. బీపీ బాధితులు కూడా ఈ ముప్పు పొంచి ఉందంటున్నారు. తినే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని.. రోజుకు కనీసం రెండు రకాల పండ్లను తింటే చాలా మంచిదని చెబుతున్నారు. కుదిరితే రోజువారీగా నడక, చమటలు పట్టేలా వ్యాయామం చేయాలని.. ఇది గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచే వీలుందంటున్నారు. సో.. మానసిక ఒత్తిడి.. జీవనశైలిలో మార్పులు లేకుండా చూసుకోవటం ద్వారా గుండెపోట్ల ముప్పు నుంచి తప్పించుకునే వీలుందన్నది మర్చిపోకూడదు. సో.. టేక్ కేర్.                




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News