బాబు స‌ర్కారును ప‌రుగులు పెట్టిస్తున్న ప‌వ‌న్‌

Update: 2017-01-17 11:34 GMT
ప‌వ‌న్  మాట‌ల విష‌యంలో ఏపీ స‌ర్కారు అలెర్ట్‌గా క‌నిపిస్తోంది. దీర్ఘ‌కాలంగా ప‌రిష్కారం కాని ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని తెర మీద‌కు తీసుకొస్తున్న ప‌వ‌న్ తీరుకు అంతే వేగంగా స్పందిస్తోంది.. బాబు స‌ర్కారు. తాజాగా ఆయ‌న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం స‌మ‌స్య‌ను తెర మీద‌కు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం నిర్ల‌క్ష్యం కార‌ణంగా వేలాదిమంది మ‌ర‌ణించ‌టంపై ప‌వ‌న్ సంధించిన ప్ర‌శ్న‌లు ప్ర‌భుత్వం మీద‌నే కాదు.. ప్ర‌జ‌ల మీదా ప్ర‌భావాన్ని చూపించాయి. ఇలాంటి అంశాల‌పై ప‌రిష్కారాన్ని చూపించ‌క‌పోతే ప్ర‌భుత్వానికి జ‌రిగే న‌ష్టాన్ని గుర్తించిన చంద్ర‌బాబు వెనువెంట‌నే స్పందిస్తున్నారు.

వేలెత్తి చూపించే అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో ప‌వ‌న్ పేర్కొన్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న లోతుగా అధ్య‌య‌నం చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉద్దానం విష‌యంలో ఏపీ స‌ర్కారు తీరు ఇప్పుడు ఇలానే ఉంది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల మూలాల్లోకి వెళ్లాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌తి ఇంటికి స‌మ‌గ్ర‌స‌ర్వే నిర్వ‌హించ‌టం ద్వారా.. మ‌రింత స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని సేక‌రించే వీలుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. అదే స‌మ‌యంలో ఈ నెల 19న మంత్రుల క‌మిటీ స‌భ్యుల బృందం ఉద్దానంలో ప‌ర్య‌టించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అస‌లు ఉద్దానం ప్రాంతంలోని వారికి కిడ్నీ స‌మ‌స్య‌లు ఎందుకు వ‌స్తాయ‌న్న విష‌యం మీద ప‌రిశీలించాలని భావిస్తోంది.

ఉద్దానం స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస‌రావు స్వ‌యంగా బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించాల‌ని భావించ‌టం చూస్తే.. ప్ర‌భుత్వం ఈ ఇష్యూకు ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. ఇంటింటికి ప్ర‌భుత్వం సర్వే పూర్తి అయిన త‌ర్వాత వ‌చ్చే నివేదిక‌ను కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్లి.. శాశ్విత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాబు స‌ర్కారు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఉద్దానం స‌మ‌స్య‌పై స‌మ‌గ్ర నివేదిక ప్ర‌భుత్వానికి అందిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప‌వ‌న్ తో భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. స‌మ‌స్య‌లు ఎత్తి చూపిన త‌ర్వాత కూడా ప్ర‌భుత్వం స్పందించ‌లేద‌న్న చెడ్డ‌పేరును మూట‌గ‌ట్టుకోవ‌టానికి చంద్ర‌బాబు ఏ మాత్రం సుముఖంగా లేర‌ని చెప్పొచ్చు. దీనికి నిద‌ర్శ‌నంగా అన్న‌ట్లు.. ఉద్దానం స‌మ‌స్య‌పై అధికారులు తీస్తున్న ప‌రుగులే ఈ స‌మ‌స్య‌పై ఏపీ స‌ర్కారు ఎంత సీరియ‌స్ గా ఉందో చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News