టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనట్లేనా ?

Update: 2021-12-17 05:32 GMT
రాజకీయాల్లో భవిష్యత్ పొత్తులకు గురువారం ఒక సంకేతం కనబడిందా ? క్షేత్ర స్థాయిలో జరిగిన ఒక ఘటనను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కుంచనపల్లిలోని జనసేన కార్యాలయంలోకి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగుపెట్టారు. ముందు ముందు మనమంతా కలిసి పనిచేయాల్సుంటుందని వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. తాజాగా జనసేన కార్యాలయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనేందుకు సంకేతంగా కనబడుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కుంచనపల్లిలో పర్యటించేందుకు లోకేష్ వచ్చారు. గ్రామంలోని మహాత్మాగాంధీ, రంగా విగ్రహాలకు పూలమాల వేద్దామని అనుకున్నారు. అయితే అప్పటికే అక్కడ జనసేన శ్రేణులున్నాయి. దాంతో పక్కకు వెళ్ళిన లోకేష్ కు ఆ పక్కనే జనసేన ఆఫీసు కనబడింది. వెంటనే ఆ ఆఫీసులోకి అడుగుపెట్టారు. లోకేష్ వస్తున్న విషయాన్ని గమనించిన తాడేపల్లి మండల అధ్యక్షుడు శివ నాగేంద్రరావు ఎదురెళ్ళి స్వాగతం పలికారు.

శివ దగ్గరకు రాగానే లోకేష్ మాట్లాడుతు ముందు ముందు మనం కలిసి పనిచేయాలని చెప్పారు. దానికి శివ బదులిస్తు పొత్తుల విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. దాంతో లోకేష్ నవ్వుకుంటు అక్కడున్న మిగిలిన నేతలకు హాయ్ చెబుతు షేక్ హ్యాండిచ్చి ఆఫీసులో నుండి బయటకు వచ్చేశారు. జరిగింది చూసిన తర్వాత టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తులకు తాజా ఘటన ఒక సంకేతంగా అర్ధమవుతోంది. మరిదే నిజమైతే జనసేన మిత్రపక్షం బీజేపీ పరిస్ధితి ఏమిటో ?

రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు రెడీ అయిపోతున్న విషయం అందరికీ అర్ధమవుతోంది. పనిలోపనిగా బీజేపీతో పొత్తుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ నుండి పొత్తుల విషయంలో సానుకూల స్పందన బయటకు కనబడకపోయినా చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలను మాత్రం మానటం లేదు. మొన్న జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ+జనసేన కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.

పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్ చంద్రబాబుకు లేదని అందరికీ తెలిసిందే. బీజేపీతో కాకపోయినా కనీసం జనసేనతో అయినా పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వాళ్ళు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. అంటే మానసికంగా రెండు పార్టీల నేతలు పొత్తులకు రెడీ అయిపోతున్న విషయం అర్ధమవుతోంది. తాజాగా లోకేష్ వ్యవహారం ఇందుకు బలమైన సంకేతాలు పంపుతోంది.
Tags:    

Similar News