టీవీలో ఐపీఎల్ మనం చూస్తే.. క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?

Update: 2022-06-13 03:53 GMT
క్రికెట్ ను మతంగా ఫీలయ్యే భారత్ లాంటి దేశంలో ఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కానీ ఐపీఎల్ కారణంగా కొత్త టాలెంట్ బయటకు రావటం కంటే కూడా.. వేలాది కోట్లు తీసుకొచ్చే కల్పతరువుగా మారిందని చెప్పాలి. తాజాగా జరుగుతున్న ఈ వేలం వివరాలు వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. టీ20 ఫార్మాట్ లో ఉండే ఐపీఎల్ టోర్నీ ప్రసార హక్కుల కోసం సాగుతున్న బిడ్డింగ్ పోరు.. యమా రంజుగా మారింది. నాలుగేళ్ల వ్యవధిలో జరిగే ఐపీఎల్ టోర్నీ మీడియా ప్రసార హక్కుల కోసం సాగుతున్న బిడ్డింగ్.. ఇప్పటివరకు రూ.43వేల కోట్లకు పలికితే.. ఈ రోజు కూడా కొనసాగే బిడ్డింగ్ కారణంగా ఇది రూ.50వేల కోట్లను దాటేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగా భారత క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం భారీగా ఉండనుంది. ఏ ఏడాదికి ఆ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య పెరగటమే కాదు.. దాని కారణంగా వచ్చే ఆదాయం భారీగా పెరిగిపోతోంది. తాజాగా 2023-2027 మధ్య కాలంలో జరిగే ఐపీఎల్ టోర్నీకి సంబంధించి మీడియా హక్కులను వేలం వేస్తున్నారు. వీటిని దక్కించుకోవటానికి భారీ పోటీ నెలకొంది. ఇప్పటివరకు రూ.43వేల కోట్ల వరకు వెళ్లిన వేలం.. ఈ బిడ్డింగ్ పూర్తి అయ్యే నాటికి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు.

మీడియా హక్కుల కోసం నడుస్తున్న పోటీ మొత్తం డిస్నీ స్టార్.. వయాకామ్ 18 మధ్యనే నడుస్తోంది. ఆదివారం మొదలై సోమవారంతో ముగిసే ఈ బిడ్డింగ్ ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ నాలుగు ప్యాకేజీలను చూస్తే..

ఏ ప్యాకేజీ.. భారత ఉప ఖండంలో టీవీ హక్కులు
బీ ప్యాకేజీ.. భారత ఉపఖండంలోని డిజిటల్ రైట్స్
సీ ప్యాకేజీ.. ఫ్లేఆఫ్స్ తో సహా 18 మ్యాచ్ లకు డిజిటల్ హక్కులు
డి ప్యాకేజీ.. భారత ఉప ఖండం మినహా మిగిలిన దేశాల్లోని టీవీ.. డిజిటల్ హక్కులు

ఏ ప్యాకేజీలోకనీస ధరగా ఒక్కో మ్యాచ్ కు రూ.49 కోట్లు.. బీ ప్యాకేజీలో రూ.33 కోట్లు.. సీ ప్యాకేజీలో రూ.11 కోట్లు.. డీ ప్యాకేజీలో రూ.3 కోట్ల చొప్పున ప్రాథమిక ధరగా నిర్ణయించారు. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్ .. సోనీ నెట్ వర్క్.. వయాకామ్ రిలయన్స్ 18.. జీ నెట్ వర్క్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇక.. ఈ హక్కుల వేలం నుంచి గూగుల్.. అమెజాన్.. యాపిల్ సంస్థలు మాత్రం బయటకు వచ్చేశాయి.

బీసీసీఐ నిర్ణయించిన ప్రాథమిక ధరకు మించి ఈ బిడ్డింగ్ లో భారీగా ధర పలుకుతోంది. ఆదివారం నాటికి టీవీ ప్రసార హక్కుల వేలం కింద ఒక్కో మ్యాచ్ కు రూ.57 కోట్లు (ప్రాథమిక ధర రూ.49 కోట్లు).. డిజిటల్ హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ.48 కోట్లు (ప్రాథమిక ధర రూ.33 కోట్లు) దాటినట్లుగా చెబుతున్నారు. సోమవారం వీటి విలువ మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News