ఏపీ హైకోర్టు అలా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇలా!

Update: 2022-09-10 11:30 GMT
ఏపీకి రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌-2కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 12కు అమ‌రావ‌తి ఉద్య‌మం చేప‌ట్టి 1000 రోజులు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఆ రోజు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు రైతులు మ‌హాపాద‌యాత్ర‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించ‌డంతో ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించి త‌మ పాద‌యాత్ర‌కు అనుమ‌తి తెచ్చుకున్నారు.. రైతులు. మొద‌టి విడ‌త పాద‌యాత్ర‌కు కూడా ఇలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాకరించిన విష‌యం తెలిసిందే.. అయితే అప్పుడు కూడా రైతులు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించి అనుమ‌తి తెచ్చుకున్నారు. మొద‌టి పాద‌యాత్ర‌ను న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పేరుతూ ఏపీ హైకోర్టు నుంచి తిరుమ‌ల వ‌ర‌కు నిర్వ‌హించారు.

అయితే.. రైతుల మ‌హాపాద‌యాత్ర‌-2కి ఏపీ హైకోర్టు అనుమ‌తించినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల‌తో ఢీ అంటే ఢీ అనేలానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్, మాజీ మంత్రి కొడాలి నానిల‌తో ప్రెస్ మీట్లు పెట్టించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ ఉద్దేశాలేంటో తేల్చిచెప్పేసింది. తాము మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఈ నేత‌లిద్ద‌రి ద్వారా వెల్ల‌డించింది. అంతేకాకుండా సెప్టెంబ‌ర్ 15 నుంచి జ‌రిగే ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు అనుగుణంగా మ‌రోమారు బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్ చెప్పారు. గ‌తంలో పెట్టిన పాత బిల్లులో స‌వ‌ర‌ణ‌లు చేసి మూడు రాజ‌ధానుల బిల్లును తెస్తామ‌న్నారు.

రైతుల మ‌హాపాద‌యాత్ర విశాఖ‌ప‌ట్నం చేరిన‌ప్పుడు ఏమైనా శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తితే దానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌వుతార‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్‌, కొడాలి నాని చెబుతున్నారు. రైతుల పాద‌యాత్ర‌కు అనుమ‌తిచ్చిన ఏపీ హైకోర్టును, న్యాయ‌మూర్తుల‌ను ఏమీ అన‌లేక చంద్ర‌బాబుపైన ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హైకోర్టును విమ‌ర్శిస్తే ఏం జ‌రుగుతుందో వైఎస్సార్సీపీ నేత‌ల‌కు తెలుసు కాబ‌ట్టి ఆ సాహ‌సం చేయ‌డం లేద‌ని అంటున్నారు.

అందుకే వ్యూహాత్మ‌కంగా రైతుల పాద‌యాత్ర ఉత్త‌రాంధ్ర‌కు చేరితే అల్లర్లు జ‌రిగితే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని కొడాలి నాని, గుడివాడ అమ‌ర్ నాథ్ త‌మ ఉద్దేశ‌మేంటో చెప్పేస్తున్నారు. మూడు రాజ‌ధానుల నుంచి తాము వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెబుతున్నారు. త‌ద్వారా ప‌రోక్షంగా కోర్టు తీర్పు ఇచ్చినా తాము ల‌క్ష్య‌పెట్ట‌బోమ‌ని స్ప‌ష్టం చేస్తున్న‌ట్టేన‌ని అంటున్నారు.

గ‌తంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లును హైకోర్టు కొట్టేసింది. అంతేకాకుండా అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత ప్రాధికార సంస్థ‌ను ర‌ద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లు కూడా చెల్ల‌ద‌ని దాన్ని కొట్టేసింది. వీటిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చినా ఆ ప‌ని చేయ‌లేదు. కేవ‌లం హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చ‌ర్చ పెట్టి విమ‌ర్శ‌లు  చేసింది. రాజ‌ధానుల ఏర్పాటుపై ప్ర‌భుత్వానికి అనుమ‌తి లేదంటోంద‌ని సీనియ‌ర్ నేత‌లతో ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేయించింది.

ఇప్పుడు అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌-2కు ఏపీ హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భ‌గ్గుమంటున్నారు. మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అయితే ఏకంగా రైతుల పాద‌యాత్రను విశాఖ‌పై దండ‌యాత్ర‌గా పోల్చారు. 29 గ్రామాల కోసం, ఒక కులం కోస‌మే చంద్ర‌బాబు అమ‌రావ‌తి జ‌పం చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తితే అది చంద్ర‌బాబుదేన‌ని వెల్లడించారు.

దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమాత్రం త‌గ్గే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా త‌మ ఉడుంప‌ట్టు మాత్రం త‌మ‌దేన‌న్న‌ట్టు ఉంటోంద‌ని చెబుతున్నారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఇలాగే ఉన్నాయ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 12 నుంచి అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌-2 ప్రారంభం కానుంది. అలాగే సెప్టెంబ‌ర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లు కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. రానున్న ప‌రిణామాలు ఏ దిశ‌గా తీసుకెళ్తాయోన‌ని ఉత్కంఠ నెల‌కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News