భారత్ లో 14 రోజులు ఉండి ఆస్ట్రేలియాకు వెళితే.. తీవ్ర శిక్ష?

Update: 2021-05-01 04:36 GMT
భారత్ లో పద్నాలుగు రోజులు ఉండి.. ఆస్ట్రేలియాకు వెళితే ఏమవుతుంది? అన్న ప్రశ్న చాలామందికి వింతగానూ.. విచిత్రంగానూ.. అసందర్భ ప్రశ్నలా అనిపించొచ్చు. కానీ.. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే షాక్ తినాల్సిందే. నిజంగా నిజం.. తాజా కరోనా పరిస్థితుల్లో భారత్ లో పద్నాలుగు రోజులు ఉండి.. ఆస్ట్రేలియాకు వెళ్లే ఆ దేశ పౌరులైనప్పటికి వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే సరికొత్త హెచ్చరికను ఆ దేశ ప్రధాని స్వయంగా వెల్లడించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తన దేశ పౌరులకు ఈ కఠిన శిక్ష గురించి తాజాగా ప్రకటన చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే.. ఆస్ట్రేలియా చరిత్రలో ఈ తీరులో ఒక దేశం నుంచి తమ దేశ పౌరులు రెండు వారాలు ఉండి వస్తే.. ఇంత తీవ్రమైన శిక్ష విధించే నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎప్పుడూ తీసుకోకపోవటమే కారణం. ఇంతకీ ఎందుకిలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ అంటే.. తాజాగా కల్లోలం రేపుతున్న కరోనా వైరస్ కు భయపడేనని చెబుతున్నారు.

ఐదేళ్ల వరకు జైలు మాత్రమే కాదు 66 వేల డాలర్ల జరిమానా కూడా విధించే వీలుందన్న మాటను చెబుతున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలో తమ దేశ పౌరులపై ఇంతటి కఠిన చట్టాన్ని పెట్టటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ నిబంధన ఈ రోజు (శనివారం) నుంచి అమల్లోకి రానున్నట్లు చెబుతున్నారు. బయో సెక్యురిటీ చట్టం కింద ఆ దేశ ప్రభుత్వం ఈ ఆదేశాల్ని జారీ చేసినట్లు చెబుతున్నారు.

వాస్తవానికి భారత్ నుంచి  ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ లో చెలరేగిపోతున్న సార్స్ కోవిడ్ 2 వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళ.. భారత్ నుంచి తమ దేశ పౌరులు వచ్చినా కఠిన శిక్షలు విధించాలని డిసైడ్ అయ్యింది. ఐపీఎల్ లో ఇప్పటికే ఆసీస్ ఆటగాళ్లు వెల్లిపోవటం తెలిసిందే. తాజా నిర్ణయం నేపథ్యంలో మరికొందరి నిర్ణయం ఏ రీతిలో ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.

ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఆస్ట్రేలియా పౌరులు సుమారు తొమ్మిది వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. మరి.. వారిలో ఎంత మంది ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లారు? తాజా నిర్ణయం నేపథ్యంలో మరెంత మంది పరుగులు తీస్తూ తమ దేశానికి వెళతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. భారత్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లే విమానాలు లేకపోవటంతో.. దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే వెసులుబాటు ఉంది.
Tags:    

Similar News