నందూ కంపెనీ మీద ఉన్న కారు.. ఆ టీఆర్ఎస్ నేత వాడటమా?

Update: 2022-11-15 06:31 GMT
తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని ఎర వేసి.. బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ రివర్సు కావటం.. ఆ ఎపిసోడ్ లో నందకుమార్ అలియాస్ నందూ అనే వ్యక్తి కీలక భూమిక పోషించటం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నందూకు బీజేపీతో పాటు టీఆర్ఎస్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దానికి నిదర్శనమన్నట్లుగా తాజాగా ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది.

నందూ పేరు చెబితేనే కేసీఆర్ మండిపడుతున్నారని చెబుతున్నారు. అయితే.. పార్టీకి చెందిన కీలక నేతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న గులాబీ నేత ఒకరు నందూ కంపెనీ పేరుతో కొన్న కారును సొంతానికి వాడుతున్న వైనం తాజాగా వెలుగు చేసింది. దాదాపు మూడు..

నాలుగు నెలల నుంచి సదరు నేత ఆ కారును వాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సదరు కారుకు నెంబరు లేకుండానే దాన్ని ఆ నేత వాడటం ఒక ఎత్తు అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కారును విడిచిపెట్టకుండా వాడేస్తున్న వైనం టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

నందకుమార్ కు చెందిన డబ్ల్యూ 3 హాస్పిటాలిటీస్ అనే కంపెనీ ఉంది. దాని పేరు మీద ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాన్ని టీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనేతకు సన్నిహితంగా ఉండే నేతకు ఇవ్వటం.. దాన్ని అతగాడు వాడుతున్నట్లుగా బయటకు వచ్చింది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన సదరు నేత టీఆర్ఎస్ ముఖ్యనేతకే కాదు.. నందూకు కూడా క్లోజ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారానికి నందూ పని చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీకి చెందిన ముఖ్యనేత అమిత్ షా కుమారుడు జైషాతోనూ తనకు పరిచయంతో పాటు.. సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా నందూ చెప్పుకునేవాడని చెబుతున్నారు. నందూ కంపెనీ కారును టీఆర్ఎస్ నేత వాడే అంశం రానున్న రోజుల్లో మరెన్ని కొత్త కాంబినేషన్లకు తెరతీస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News