వ్యాక్సినేష‌న్లో కేంద్రం కీలక యోచ‌న‌.. ఆ రెండూ మిక్స్ చేసే ఛాన్స్‌!

Update: 2021-08-04 08:44 GMT
భార‌త్ లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ తీవ్ర‌త మొద‌లైన‌ట్టుగానే క‌నిపిస్తోంది. దేశంలోని ప‌లు జిల్లాలో పాజిటివిటీరేటు పెరుగుతుండ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. సెకండ్ వేవ్ క‌ల్లోలం నేప‌థ్యంలో.. ఈ సారి కేంద్రం ముందుగానే అల‌ర్ట్ అయ్యింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల‌ను, ఆ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్న‌ జిల్లాల‌ను గుర్తించి, అప్ర‌మ‌త్తం చేసింది. తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తోపాటు మొత్తం 25 రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ట్టు గుర్తించింది. ఈ రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో కేసుల ఎక్కువ‌గా పెరుగుతున్న‌ట్టు లిస్ట్ ఔట్ చేసింది. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

ఇదిలా ఉంటే.. వైర‌స్ పై వ్యాక్సిన్ తీవ్ర‌త ఎంత అనే విష‌యంలో ఆందోళ‌న క‌లిగించే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారిన డెల్టా, డెల్టా ప్ల‌స్ ను ఎదుర్కోవ‌డంలో వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌ట్లేద‌ని వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాదు.. కొవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు రోజుల‌ల త‌ర్వాత యాంటీ బాడీలు స‌గానికిపైగా త‌గ్గిపోతున్న‌ట్టు తేలింద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. త‌ద్వారా.. డెల్టా వైర‌స్ ను ఎదుర్కోవ‌డం సాధ్యం కాద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తమైంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సిన్ మిక్సింగ్‌ ఆలోచ‌న చేస్తోంది. అంటే.. మొద‌టి డోసుగా ఒక కంపెనీ వ్యాక్సిన్‌, రెండో డోసుగా మ‌రో కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసేందుకు యోచిస్తోంది.

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకూ స‌రికొత్త వేరియంట్లుగా మారిపోతున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు.. చైనాలో వెలుగు చూసినప్ప‌టి కొవిడ్-19కు.. ఇప్పుడు ప్ర‌పంచంలో మ‌నుగ‌డ‌లో క‌రోనాకు అస‌లు సంబంధ‌మే లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ ఎన్ని ర‌కాలుగా రూపాంత‌రం చెందిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే.. ఇందులో ప‌లు వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా, అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మార‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ వేరియంట్ల‌లో.. బ్రెజిల్ లో వెలుగుచూసిన (P.1), సౌతాఫ్రికాలో గుర్తించిన‌ (B.1.351), బ్రిట‌న్ లో రూపాంత‌రం చెందిన‌(B.1.1.7)తోపాటు భార‌త్ లో వెలుగు చూసిన (B.1.617) వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. అయితే.. వీట‌న్నింటిలో భార‌త్ లో గుర్తించిన B.1.617 వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన అన్ని ర‌కాల మ్యుటెంట్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని నిపుణులు నిర్ధారించారు.

అయితే.. ఇందులోనూ మ‌రో మూడు ర‌కాలు వెలుగులోకి వ‌చ్చాయి. అవి.. B.1.617.1, B.1.617.2, B.1.617.3గా ఉన్నాయి. అయితే.. ఇందులో B.1.617.2 ర‌కం చాలా బ‌లంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు చెబుతున్నారు. భార‌త్ లో సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విజృంభించ‌డానికి కూడా ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని భావిస్తోంది. భార‌త్ లో దాదాపు 12 వేల‌కు పైగా వేరియంట్స్ ను గుర్తించ‌గా.. ఇవే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన‌ట్టు నిపుణులు నిర్ధారించారు. అయితే.. ఇప్పుడు డెల్టా ప్ల‌స్‌ వేరియంట్ ద‌డ పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేరియంట్ వ్యాక్సిన్ల‌కు సైతం లొంగే అవ‌కాశాలు త‌క్కువేన‌ని నిపుణులు సందేహించారు. అయితే.. ఇది నిజ‌మేన‌ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. తాము చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని తెలిపారు. డెల్టా వేరియంట్ ను వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోలేక‌పోతోంద‌ని చెప్పారు.

అదేవిధంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డి, కోలుకున్న వారిలో ఉత్ప‌త్తి అయిన యాంటీ బాడీలు కూడా డెల్టాను ధీటుగా ఎదుర్కోలేక‌పోతున్నాయ‌ని గుర్తించారు. ఈ కార‌ణంగానే.. ఒక‌సారి కొవిడ్ బారిన ప‌డిన‌వారు.. రెండోసారి కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇక‌, ఈ వేరియంట్ వ‌చ్చిన వారిలో శ్వాస వ్య‌వ‌స్థ తీవ్రంగా ఇన్ఫెక్ట్ అవుతోంద‌ని కూడా ఢిల్లీ వైద్యులు తెలిపారు. కొవీషీల్డ్ వేసుకున్న‌వారిలో కొంత కాలం త‌ర్వాత యాంటీ బాడీలు త‌గ్గిపోతున్న‌ట్టు కూడా తేల్చారు.

ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ మిక్సింగ్ అంశాన్ని తెర‌పైకి తెచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా.. ర‌ష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్ -వి, ఆక్స్ ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనికా ఉత్ప‌త్తి చేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్ల‌ను మిక్సింగ్ డోసులుగా వేసే అంశాన్ని కేంద్రం ప‌రిశీలిస్తోంది. ఈ రెండు వ్యాక్సిన్ల‌లో ఏదైనా ఒక‌టి ముందు, రెండోది త‌ర్వాత వేసుకునే అవ‌కాశాన్ని చూస్తోంది. మ‌రి, దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? మిక్సింగ్ డోస్ కరోనాను ఎంత వరకు కట్టడి చేస్తుంది? అన్న ప్రశ్నకు రిపోర్టులే సమాధానం చెప్పాలి.


Tags:    

Similar News