సీరియల్ నేరస్థులకు చెక్ పెట్టే ఐడియాతో కేంద్రం రెడీ

Update: 2022-03-17 04:29 GMT
నేరాలు చేయడం, తప్పించుకు తిరగటంలో చాలా స్మార్టుగా ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్టుగా తయారవ్వాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం కొత్త చట్టాలను రెడీ చేసుకుంటోంది. నేరస్తుల వివరాల నమోదుకు కేంద్రం కొత్త చట్టం తయారుచేసింది. దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. ఇది గనుక ఆమోదం పొందితే 130 ఏళ్ళ కిందటి చట్టం రద్దయి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.

 ఇంతకీ విషయం ఏమిటంటే నేరాలు చేయటంలోను, తప్పించుకోవటంలోనే నేరస్తులు అత్యంత ఆధునికమైన టెక్నాలజీని వాడుతున్నారు. టెక్నాలజీని వాడుకోవటంలో నేరస్తులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. మరి నేరస్తులు అప్ డేట్ అయినపుడు పోలీసులు కాకపోతే ఎలా ? అందుకనే అత్యంత అధునాతన సాఫ్ట్ వేర్ ను కేంద్రం రెడీ చేసింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ పేరుతో తయారైన కొత్త బిల్లులో అనేక అంశాలున్నాయి.

 దీని ప్రకారం ముందుగా వివిధ నేరాల్లో దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్న వారి వేలిముద్రలు, అరచేతి ముద్రలు, ముఖాలను స్కానింగ్ చేస్తారు. అలాగే ఐరిస్ ను కూడా స్కాన్ చేస్తారు. పాదముద్రలు, రెటీనా, చేతిరాత తదితరాలన్నింటినీ సేకరించి డిజిటలైజ్ చేస్తారు.

అలాగే విచారణ ఖైదీల వివరాలను కూడా సేకరించి భద్రపరుస్తారు. ఇలాంటి వివరాలన్నింటినీ దర్యాప్తు సంస్ధలన్నింటికీ అందిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో ఉంచుతారు.

 వీటివల్ల ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే తమదగ్గరున్న వివరాలతో పోల్చి చూసుకుంటారు. దీనివల్ల నేరస్తులను పట్టుకోవటం తేలికవుతుంది. ఈ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని కూడా కేంద్రం డిసైడ్ చేసింది.

ఇలాంటి వివరాలే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునేట్లుగా కేంద్రం వెసులుబాటు కల్పిస్తోంది. నేర విచారణలో దర్యాప్తు సంస్ధల మధ్య సమన్వయం ఉంటే నేరస్తులను పట్టుకోవడం చాలా తేలిక.
Tags:    

Similar News