సీజేఐకు స్వాగతం చెప్పటానికి సీఎంకు తీరిక లేదు.. మంత్రులూ రాలేదే!

Update: 2021-10-15 05:03 GMT
ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. భారత దేశ ప్రధాన న్యాయమూర్తి. అలాంటి ఆయన ఒక పుణ్యక్షేత్రానికి వస్తే.. ఆయనకు స్వాగతం పలకటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి.. కుదరదంటే రాష్ట్ర మంత్రులు హాజరు కావటం.. ఆయన్ను సాదరంగా స్వాగతం పలకటం లాంటివి చేస్తుంటారు. అందుకు భిన్నమైన వాతావరణం ఏపీలో నెలకొందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా తిరుమల తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

మామూలుగా ఇలాంటిదే మరే రాష్ట్రంలోనైనా చోటు చేసుకుంటే.. అయితే ముఖ్యమంత్రి లేదంటే నలుగురైదుగురు మంత్రుల్ని పంపి.. ఘనంగా స్వాగతాలు పలకటం చేస్తుంటారు. కానీ..ఏపీలో మాత్రం అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. తాజాగా తిరుమల శ్రీవారి కార్యాలయానికి వచ్చిన సీజేఐను స్వాగతం పలికింది ఎవరో తెలుసా? టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.. ఈవో జవహర్ రెడ్డి.. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి.. సీవీఎస్ వో గోపినాథ్ జెట్టిలు మాత్రమే.

అయితే.. వీటినేమీ పట్టించుకోని సీజేఐ మాత్రం స్వామివారి ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న అశ్వ వాహన సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవటం.. మొక్కులు చెల్లించుకోవటంలో బిజీబిజీగా గడిపారు. సీజేఐ ఎన్వీ రమణతో పాటు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్టిస్ హిమ కోహ్లి.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన కీలకమైన న్యాయమూర్తులు వచ్చినప్పటికీ.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరించిన ఏపీ సర్కారు తీరు మరోసారి చర్చగా మారింది.


Tags:    

Similar News