జైల్లో ఉన్న ఆ దేశ విపక్ష నేత.. ఏ క్షణంలోనైనా మరణం.. అమెరికా ఏమంది?

Update: 2021-04-19 11:03 GMT
విప్లవానికి.. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన రష్యాలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితా? అన్న సందేహం తలెత్తే పరిస్థితి. సోవియట్ యూనియన్ గా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం.. తర్వాతి కాలంలో చీలికలు పీలికలుగా మారిపోయి సంగతి తెలిసిందే. అలా ముక్కలైన తర్వాత రష్యా పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్నా.. అదేమీ సాధ్యం కాని పరిస్థితి. ఆ దేశానికి అధ్యక్షుడిగా వాద్లిమర్ పుతిన్ అయిన తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఏకులా వచ్చి మేకులా అన్న చందంగా.. రాబోయే పుష్కర కాలానికి తాను తప్పించి మరెవరూ దేశ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని చేపట్టలేని రీతిలో రాజ్యాంగాన్ని తనకు అనుగుణంగా మార్చేసుకున్నారు.

రాజకీయంగా తనను వ్యతిరేకించేవారిని.. విభేదించే వారి విషయంలో ఎంత కర్కసంగా వ్యవహరిస్తారన్న విషయం 44 ఏళ్ల విపక్ష నేత అలెక్సీ నావల్నీ పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పుతిన్ విధానాల్ని ఘాటుగా విమర్శించే ఆయన కొంతకాలంగా జైల్లో ఉండిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విష ప్రయోగం జరగటం.. అనంతరం జర్మనీలో ఐదు నెలల పాటు చికిత్స పొంది.. స్వదేశానికి వచ్చిన ఆయన్ను.. ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. జనవరి నుంచి జైల్లోనే ఉన్నారు.

నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులో రెండున్నరేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన.. తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడుతున్నట్లుగా పేర్కొన్నారు. తన కాళ్లు స్పర్శను కోల్పోతున్నాయని.. వ్యక్తిగత వైద్యుడ్ని అనుమతించాలని కోరగా.. అధికారులు ఆయన వినతికి నో చెప్పారు. దీంతో.. నిరసనకు దిగిన ఆయన మూడు వారాలుగా జైల్లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. తాజాగా నావల్నీ ఆరోగ్యం దారుణ పరిస్థితుల్లో ఉందని.. ఆయన ఏ క్షణంలో అయినా మరణించే వీలుందని పేర్కొన్నారు.

నావెల్నీ కుటుంబ సభ్యులకు అందజేసిన వైద్య పరీక్షల రిపోర్టును చూస్తే.. రక్తంలో పోటాషియం.. క్రియాటినిన్ స్థాయిలు పెరిగిపోయాయి. గుండెపోటుకు.. కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణమవుతుందని చెబుతున్నారు. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేసే పుతిన లాంటి నియంతలు దేశాధ్య స్థానంలో ఉంటే.. ఆ దేశం నుంచి ఇంతకు మించి మరేం ఆశించగలం. ఇదిలా ఉంటే.. నవాల్నీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.

విపక్ష నేత జైల్లో మరణిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నావల్నీకి ఏమైనా జరిగితే తాము ఊరుకోమని.. ఏదైనా జరిగితే.. అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని.. అదే జరిగితే రష్యాపై ఆంక్షలు విధించాలన్న అంశంపై తాము చర్చ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.


Tags:    

Similar News