ఈ సీఎంను చూసి నిజంగానే అందరూ నేర్చుకోవాలి

Update: 2021-09-02 00:30 GMT
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. పగోళ్లు కూడా ఆయన చేష్టలకు చప్పట్లు కొడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజ ఉపయోగ నిర్ణయాలను వరుసగా తీసుకుంటూ అందులోని రాజకీయాన్ని పక్కన పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం స్టాలిన్ వైఖరి నిజంగానే మెచ్చుకోదగినదిగా ఉంది.

సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి స్టాలిన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నాయి.. ముందుగా యూనివర్సిటీలు.. కాలేజీలలో ప్రొఫెషనల్స్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం కోటాను అందించి పేద విద్యార్థుల మనసు దోచేశాడు. ఇది చాలా ధైర్యమైన స్టెప్ అని చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్వహణ పాఠశాలల విశ్వసనీయతను పెంచేలా చేసింది..

ఇటీవల సీఎం స్టాలిన్ ఎన్నడూ లేనంతగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారు. తమిళనాడులో పెట్రోల్.. డీజిల్ ధరలు 3 రూపాయలు తగ్గించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 1190 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఏదేమైనా స్టాలిన్ నిర్ణయాన్ని సామాన్యులు సైతం బాగా ప్రశంసిస్తున్నారు..

ఇక ఇటీవల సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీని ఆశ్చర్యపరిచారు. 65 లక్షల స్కూల్ బ్యాగ్‌లపై అన్నాడీఎంకే మాజీ సీఎంలు జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు ఉంచాలని స్టాలిన్ విద్యాశాఖను ఆదేశించడం సంచలనమైంది. ఈ బ్యాగులను రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించాడు.

కొత్త బ్యాగులు.. వస్తు సామగ్రి కోసం ఆర్డర్లు ఇవ్వడానికి బదులుగా, ఉపయోగించని ఈ బ్యాగులను పంపిణీ చేయాలని సిఎం స్టాలిన్ నిర్ణయించాడు. ఇది రాష్ట్ర ఖజానాకు రూ .13 కోట్లు ఆదా చేసింది. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి ఆశ్చర్యపోయారు. డీఎంకే క్యాడర్‌లోని అసంతృప్తి గురించి ఆయన తెలియజేసినా స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. .

పథకాలు, పనుల్లో రాజకీయ చొరవ వద్దని.. ప్రభుత్వ చొరవ కావాలని సీఎం స్టాలిన్ సమాధానమిచ్చారు. సీఎం స్టాలిన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష అన్నాడీఎంకే స్వాగతించింది. స్టాలిన్ నాయకత్వంలో ప్రతీకార రాజకీయాలు తగ్గాయని అన్నాడీఎంకే కొనియాడింది.

తెలుగు రాష్ట్రాల్లో, కేంద్రంలో ఎక్కడైనా సరే కొత్త వారు అధికారంలోకి వస్తే పథకాల పేర్లు అన్నీ మార్చేస్తుంటారు. అది ఆనవాయితీ.. ఏపీలో జగన్ అయినా.. తెలంగాణలో కేసీఆర్ అయినా.. కేంద్రంలో మోడీ అయినా తమ పేరు.. తమ పార్టీ ముఖ్యుల పేర్లతో పథకాలు మార్చి అమలు చేస్తున్నారు.

అయితే సీఎం స్టాలిన్ మాత్రం అధికారంలోకి వచ్చాక తన ప్రత్యర్థి, ప్రతిపక్ష అన్నాడీఎంకే అధినేత జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మా క్యాంటీన్లను’ అదే పేరుతో కొనసాగించడం సంచలనమైంది. పేదలకు ఉపయోగపడే పథకాలను తాను రాజకీయం కోసం వాడుకోనని.. జయలలితపేరునే కొనసాగించడం ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతల మనసులు కూడా గెలుచుకుంది.

ఇక అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే ఉద్దేశంతో ఏకంగా 65 లక్షల స్కూలు బ్యాగులు తయారు చేయించారు. వాటిపై మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఫళనిస్వామి, అన్నాడీఎంకే బొమ్మలను ఉంచారు. అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం అయ్యారు.

ఈ క్రమంలోనే 65 లక్షల బ్యాగులు ప్రత్యర్థుల ఫొటోలతో ఉండడం చూసి అధికారులు , డీఎంకే పార్టీ నేతలు వీటిని పంచితే అన్నాడీఎంకేకే లబ్ధి అని.. పంచవద్దని సూచించారు. కానీ సీఎం స్టాలిన్ మాత్రం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఫొటోలు మార్చి కొత్త ఫొటోలతో స్కూల్ బ్యాగులు తయారు చేయాలంటే 13 కోట్లు ఖర్చు అవుతుందని.. పన్ను కట్టే ప్రజల డబ్బును ఇలా ఫొటోల కోసం వృథా చేయకూడదని స్టాలిన్ నిర్ణయించారు. ఈ డబ్బునే మరో సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిద్దాం అని తమిళ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇలా ప్రత్యర్థుల వాసన వస్తేనే గిట్టని సీఎంలు, కేంద్రమంత్రులు, పీఎంలున్న ఈరోజుల్లో కూడా ప్రత్యర్థులను కూడా మిత్రులుగా చేసేలా అభివృద్ధి కోసం పంతాలకు పోని సీఎం స్టాలిన్ మాత్రమేనని తమిళనాట ప్రశంసలు కురుస్తున్నాయి. స్టాలిన్ పాలనపై ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతలు కూడా మెచ్చుకోవడం ఆయన పాలనదక్షతకు నిదర్శనంగా మారింది. స్టాలిన్ ను చూసి దేశంలోని సీఎంలు, నేతలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.అందుకే ఇటీవల బెస్ట్ సీఎం అవార్డుల్లో స్టాలిన్ ముందు వరుసలో నిలవడం విశేషంగా చెప్పొచ్చు.




Tags:    

Similar News