కన్న కూతురు కోసం జెండర్ మార్పు.. ఓ నాన్న పోరాటం ఫలించేనా..!

Update: 2023-01-06 23:30 GMT
పిల్లలకు తండ్రి ఎక్కువ? లేదా తల్లి ఎక్కువ? అని ప్రశ్నిస్తే ఎవరైనా ఏమని చెప్పగలరు?. తెలిసీ తెలియని వయస్సులో అయితే చిన్నారులు ఎవరో ఒకరి పేరు చెబుతుంటారు. పిల్లలకు అమ్మతో కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెజారిటీ శాతం అమ్మ పేరే చెబుతుంటారు. అలా అని నాన్న తక్కువ అని అర్థం కాదు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది.

ఇంట్లో పరిస్థితులు.. ఇతరత్ర సమస్యలు.. భార్యాభర్తల గొడవల వల్ల పిల్లల వైఖరిలోనూ తల్లిదండ్రుల పట్ల దృక్పథం మారిపోతూ ఉంటుంది. భార్య భర్తల గొడవలు ఒక్కోసారి పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు సైతం నలిగి పోతుంటారనే విషయం అందరికీ తెలిసిందే.

భార్యాభర్తలు విడిపోయినప్పుడు చట్టం మాత్రం పిల్లలు తల్లి వద్దే ఉండాలని తీర్పును ఇస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే నాన్నలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జెండర్ కారణంగా తమ పిల్లలు తమకు దూరంగా ఉండటాన్ని నాన్నలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఏకంగా తన జెండర్ మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈక్వెడార్ కు చెందిన రినె సలినాస్ రామోస్(47) అనే వ్యక్తి భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఆ దేశ చట్టాల ప్రకారం తల్లి వద్ద పిల్లలు ఉండాలనే నిబంధన ఉంది. దీంతో తన కన్నకూతుళ్ల సంరక్షణను తల్లే తీసుకోవాల్సి వస్తుంది. అయితే తన కూతుళ్లు మాత్రం తల్లి దగ్గర సంతోషంగా లేరని రామోస్ చెబుతున్నాడు. తన పిల్లలను తనకు అప్పగించాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలోనే రామోస్ తన ఐడీ కార్డులో జెండర్ ను పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు. చట్టపరంగా తాను కూడా ఇప్పుడు తల్లిని అయ్యానని.. పిల్లలు తనకే అప్పగించాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉందని తెలుస్తోంది. అయితే రామోస్ తన జెండర్ ను మార్చుకోవడంపై ఈక్వెడార్ లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

తాము ఆడ నుంచి మగకు.. మగ నుంచి ఆడకు సర్జరీలు చేయించుకొని అధికారిక గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని టాన్స్ జెండర్స్ చెబుతున్నారు. అలాంటిది ఓ పురుషుడు మాత్రం తన లింగాన్ని మహిళగా ఇంత ఈజీగా మార్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రామోస్ స్పందిస్తూ.. తాను చేసిందాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని.. తన కూతుళ్ల కోసమే అలా చేసినట్లు వెల్లడించారు. పురుషులకు సైతం తమ పిల్లలపై హక్కు కల్పించాలనే తాను సైతం పోరాడుతున్నట్లు రామోస్ వివరణ ఇచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News